బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు కూటమి రాజకీయాలకు స‌వాల్‌గా మార‌నున్నాయి. ఒక్క పార్టీ ఆధిపత్యం కాకుండా, రెండు ప్రధాన కూటముల్లో పలు పార్టీలు కలిసి పోటీ చేయడం వలన రాజకీయ సమీకరణాలు క్లిష్టంగా మారాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో, ఈసారి ఏ పార్టీకి కూడా స్వతంత్రంగా మెజార్టీ సాధించే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ ఆర్జేడీ. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ 143 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌తో కలసి ఏర్పడిన ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి 61 స్థానాలు కేటాయించగా, వామపక్ష పార్టీలు మిగతా స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఆర్జేడీ పోటీ చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ నేతలు “ఫ్రెండ్లీ ఫైట్” పేరుతో స్వతంత్రంగా నామినేషన్లు వేయడం కూటమికి తలనొప్పిగా మారింది.


ఇక మరోవైపు, బీజేపీ–జేడీయూ కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఈ కూటమిలో బీజేపీ 101 స్థానాలు, జేడీయూ 102 స్థానాలు పొందాయి. మిగతా సీట్లు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చీరాగ్ పాశ్వాన్ పార్టీకి, మరికొన్ని చిన్న పార్టీలకు కేటాయించారు. ఈ కూటమి ప్రభుత్వం కొనసాగింపుకే పోటీ చేస్తోందని చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఈసారి ఏ కూటమిలోనూ భాగం కాలేదు. అయినా.. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓవైసీ తన అభ్యర్థులను నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో ఈ పార్టీ చర్చకు వస్తే, ఈసారి పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు.


ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ మాత్రం స్వతంత్రంగా పోటీ చేస్తోంది. వారు కూటమి రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఎక్కడ బలమైన అభ్యర్థి ఉంటే అక్కడే పోటీ చేస్తున్నారు. తొలుత ప్రశాంత్ కిషోర్ తేజస్వీ యాదవ్‌పై రఘోపూర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరికి ఆయన వెనక్కి తగ్గారు. ఈ కారణంగా బీహార్ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన పోటీలు కొంత వరకు మాయమయ్యాయి. ముఖ్యంగా సీఎం నితీష్ కుమార్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో, తేజస్వీ యాదవ్ మాత్రమే సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్నారు. మొత్తంగా, బీహార్ ప్రజాస్వామ్య పోరాటం ఈసారి కూటముల సమీకరణాలతో, వ్యూహాలతో, అంతర్గత విభేదాలతో మలుపులు తిరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp