తెలంగాణలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తెలంగాణలోని ముఖ్యమైన గ్రూప్ వన్, గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. కేవలం రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్టులు ఇచ్చేస్తారు. ఇది నిజంగా గ్రూప్ వన్, గ్రూప్ 2 లకు ప్రిపేర్ అయ్యేవారికి ఎంతో శుభవార్త అని చెప్పొచ్చు.. వాస్తవానికి ఈ రెండు పోస్టులకు ఒక పోస్టుకు ఇద్దరిని చొప్పున ఇప్పటి వరకూ ఇంటర్వ్యూల నిర్వహించే వారు. ఇంటర్వ్యూల్లో మార్కులు చాలాసార్లు కీలక పాత్ర పోషించేవి.


అంతే కాకుండా.. ఇంటర్వ్యూ వరకూ వెళ్లిన వారిలో సగం మంది వెనక్కి వచ్చేస్తారు. అంటే సరిగ్గా గెలుపు ముందు బోర్లా పడినట్టు అన్నమాట. అంతే కాదు.. ఈ ఇంటర్వ్యూల్లో అక్రమాలకు ఆస్కారం ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూల్లో తమకు నచ్చిన వారికి ఫుల్ మార్కులు వేసేసి ర్యాంకులు మార్చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండేవి కావు.. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ సర్కారు గ్రూప్ 2 పోస్టులు కూడా చాలా కీలకం కాబట్టి వాటికి కూడా ఇంటర్వ్యూలు పెట్టింది.


ఇక ఇంటర్వ్యూల విధానం వల్ల ఉద్యోగార్థి మనస్తత్వాన్ని ఉద్యోగానికి ఎంత వరకూ న్యాయం చేస్తాడనే విషయాన్ని నేరుగా పరిశీలిస్తారని.. అందువల్ల ఇంటర్వ్యూ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతుండేది. ఎందుకంటే ఇవి అల్లాటప్పా పోస్టులు కావు.. రాష్ట్ర స్థాయిలో ఇవే అత్యున్నత పోస్టులు. అలాంటి పోస్టులు ఇంటర్వ్యూల లేకుండా ఎలా ఇస్తారన్న వాదన కూడా వినిపించేది. కానీ.. ఇటీవల ఏపీలో ఏ గ్రూప్ ఉద్యోగానికి కూడా ఇంటర్వ్యూ లేకుండా నిర్ణయం తీసుకున్నారు.


ఇక ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్లింది. ఇప్పుడు ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల అభ్యర్థులు పూర్తిగా రాత పరీక్షపైనే ఆధారపడి మంచి మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల చాలా వరకూ అక్రమాలు జరిగే అవకాశాలు తగ్గిపోయినట్టే అంటున్నారు ఉద్యోగార్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: