తూర్పు గోదావరి జిల్లాలో రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అనపర్తి. గత మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ రెడ్ల హావానే కొనసాగుతుంది. అధికారమైన, ప్రతిపక్షమైన రెడ్డి నేతలే ఉంటున్నారు. గత రెండు పర్యాయాలు నుంచి ఇక్కడ టీడీపీ, వైసీపీల నుంచి ఇద్దరు రెడ్డి నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. 

 

2014 ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి తనయుడు రామకృష్ణారెడ్డి బరిలో దిగగా, వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి మేనల్లుడు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పోటీ చేశారు. అయితే స్వల్ప మెజారిటీతో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఓడిపోయిన సూర్యనారాయణ రెడ్డి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

 

ఆ కృషి ఫలితమే 2019 ఎన్నికల్లో సూర్యనారాయణ,  రామకృష్ణారెడ్డిపై దాదాపు 55 వేల మెజారిటీతో గెలుపొందారు. స్వతహాగా డాక్టరైన సూర్యనారాయణ, సొంత ఆసుపత్రి పెట్టి గత మూడు దశాబ్దాల నుంచి అనపర్తి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టి వారికి పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎక్కువ హడావిడి చేయకుండా సైలెంట్ గా పనిచేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 

 

ఇప్పుడు కరోనా వ్యాప్తి పెరగకుండా తన నియోజకవర్గ ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకుంటున్నారు. ఇంకా విరాళాలు సేకరిస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు. ఇక నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అయితే ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరమే కావొస్తుండటంతో, నియోజకవర్గంలో  గతంలో జరిగినవి తప్ప ఇప్పుడు అనుకున్న మేర ఏమి అభివృద్ధి జరగలేదు. 

 

ఇక ఇక్కడ టీడీపీని రామకృష్ణారెడ్డి నడిపిస్తున్నారు. ఈయన నిత్యం అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తనవంతు సాయం అందిస్తున్నారు. అయితే గత ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానివల్ల ఇంకా ఈయన నియోజకవర్గంలో పుంజుకోలేదు. 

 

అటు స్థానిక సంస్థల ఎన్నికల పరంగా చూసుకున్న, నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. నియోజకవర్గంలో ఉన్న పెదపూడి, బిక్కవోలు, అనపర్తి, రంగంపేట మండలాలలో వైసీపీ బలంగానే ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో డాక్టరుకు పెద్ద ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి లేదు. మొత్తానికి చూసుకున్నట్లైతే అనపర్తిలో డాక్టర్ సైలెంట్ గా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: