ఈ సారి జగన్ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయడానికి చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి మంత్రి అని పిలిపిచుకోకపోతే మళ్లీ మంచి అవకాశం రాదని భావిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా...కొందరికి ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం రాదు. అలాగే ఎమ్మెల్యేలుగా గెలిస్తే..వైసీపీ అధికారంలోకి రాకపోతే ఉపయోగం ఉండదు. అందుకే ఇప్పుడే మంత్రి పదవి కొట్టేయాలని పలువురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సైతం క్యాబినెట్‌లో ఛాన్స్ దక్కించుకోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం ఎలాగో విశాఖపట్నం నుంచి అవంతి శ్రీనివాస్ ఒక్కరే క్యాబినెట్‌లో ఉన్నారు. నెక్స్ట్ మంత్రివర్గంలో మార్పులు చేసేటప్పుడు, విశాఖకు రెండు, మూడు పదవులు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అప్పుడు మంత్రిగా అవకాశం దక్కించుకోవాలని ధర్మశ్రీ చూస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేగా కూడా ధర్మశ్రీ దూకుడుగా పనిచేస్తున్నారు.

ఈయన ప్రజల్లోనే తిరుగుతున్నారు...వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే అధికార ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష టీడీపీపై దూకుడుగానే విమర్శలు చేస్తున్నారు...అప్పుడప్పుడు జగన్‌కు భజన కూడా చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలని సక్రమంగా అమలయ్యేలా చూసుకుంటున్నారు. చిన్నాచితక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.

కాకపోతే ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువే...రోడ్లకు గుంతలు ఎక్కువ...ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్ల సదుపాయం తక్కువ. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే. కనీస వైద్య సదుపాయాలు లేక గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సురక్షితమైన తాగునీరు అందడం కష్టం. రోలుగుంట మండలంలో సాగునీరు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇలా నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై ధర్మశ్రీ ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది.

ప్రస్తుతానికి ధర్మశ్రీ రాజకీయంగా బలంగానే ఉన్నా సరే...ఏదొక సమయంలో టీడీపీ పుంజుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా చోడవరం టీడీపీకి కంచుకోట..ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కే‌ఎస్‌ఎన్ రాజు సైతం దూకుడుగా పనిచేస్తున్నారు. అయితే ధర్మశ్రీకి మంత్రి పదవి దక్కాక చోడవరం రాజకీయం మరింత మారవచ్చు..మరి ధర్మశ్రీకి మంత్రి పదవి దక్కుతుందో లేదో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: