ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలకు ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో తప్పించి మరి ఏ భాషలలోను క్రేజ్ లేకపోయినా మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘భరత్ అను నేను’ మూవీ వెనుక అమెరికా అధ్యక్షుడు ఉండటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న టాప్ దర్శకులు అంతా విపరీతమైన అభద్రతా భావంతో రకరకాల భాషలకు సంబంధించిన సినిమా కథలను అనుసరిస్తూ తమ సినిమాలకు కథలు వ్రాసుకుని గందరగోళం పడుతున్న విషయం తెలిసిందే.

‘అజ్ఞాతవాసి’ తరువాత ఈ కాపీ రూమర్స్ కొరటాల శివ తీస్తున్న ‘భరత్ అను నేను’ పై వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కథ ఒక హాలీవుడ్ సినిమా కథకు కాపీ అనే వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు ఈమూవీ కథకు సంబంధించి మరింత క్లారిటీ వస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం 1995 ప్రాంతంలో హాలీవుడ్ లో విడుదలైన ‘ది అమెరికన్ ప్రెసిడెంట్’ మూవీకి ‘భరత్ అను నేను’ అనుసరణ అని అంటున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రోబ్ రైనర్ దర్శకత్వం వహించిన ఈమూవీ అప్పట్లో హాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మైఖేల్ డోగ్లాస్ అమెరికన్ ప్రెసిడెంట్ గా నటించిన ఈమూవీ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను పొందింది.

ఇప్పుడు అదే కథను మన తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థుతులను దృష్టిలో పెట్టుకుని అనేక మార్పులు చేర్పులు చేసి ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ గా కొరటాల శివ మహేష్ కోసం మార్చినట్లు చెపుతున్నారు. హాలీవుడ్ అమెరికన్ ప్రెసిడెంట్ కథ వైట్ హౌస్ నేపధ్యంలో కనిపిస్తే ‘భరత్ అను నేను’ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగే మూవీగా కొరటాల మార్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో శేఖర్ కమ్ముల ‘లీడర్’ సినిమా ఛాయలు ఈ మూవీ పై అక్కడక్కడా కనిపిస్తాయి అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ విషమ పరీక్షను కొరటాల మహేష్ ల ద్వయం ఎలా ఎదుర్కుంటారు అన్న విషయమై అనేక ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి