
టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజనుకు పైగానే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ లీల. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి జోడిగా నటిస్తుంది అంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. హను రాఘవపూడి ప్రభాస్ తో తీయబోయే పీరియాడికల్ లవ్ స్టోరీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోందని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ న్యూస్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని హను రాఘవపుడిని అడిగితే అలాంటిది ఏమీ లేదని చెప్పాడు. అంతేకాకుండా ప్రభాస్ తో తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
మంగళవారం సాయంత్రం హైదరాబాదులో జరిగిన ఓ వెబ్ సిరీస్ ఈవెంట్ లో భాగంగా కొంతమంది మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయిన హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమా విషయమై మాట్లాడుతూ.." ప్రస్తుతం ప్రభాస్ మారుతి సినిమాతో పాటు మిగతా కమిట్మెంట్స్ అన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్, నా సినిమా ఒకేసారి ప్రారంభం కావచ్చు. బహుశా వచ్చే ఏడాది చివరి నాటికి అది జరగొచ్చు ఆ తర్వాతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్యాస్టింగ్ పై దృష్టి పెడతాం" అని హను రాఘవపూడి చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రభాస్ సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తోందనే వార్త పూర్తిగా అవాస్తవమని తేలింది.
మరోవైపు ప్రభాస్ కి జోడిగా శ్రీలీల నటిస్తుందనే విషయం ఒక్కసారిగా బయటికి రావడంతో ఈ వార్త విని డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రభాస్ పక్కన శ్రీలీల సెట్ అవ్వదని, వాళ్ళ కెమిస్ట్రీ ఏ మాత్రం వర్కవుట్ అవ్వదని ఫ్యాన్స్ అభిప్రాయం. మరి హను రాఘవపూడి ప్రభాస్ కి జోడిగా ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తాడో చూడాలి. గత ఏడాది హను రాఘవపూడి 'సీతారామం' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ కోసం వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.