
మిరాయ్ ఐదు భాషల్లో రిలీజ్ అయినా, ప్రమోషన్స్‌లో మనోజ్ ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యారు. హీరో తేజ దేశం నలుమూలల తిరుగుతూ సినిమా బజ్ క్రియేట్ చేస్తే, మనోజ్ మాత్రం ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇదే విషయంపై మనోజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రస్తావిస్తూ పరోక్షంగా తన అసహనం వ్యక్తం చేశారు. `తేజ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, అన్ని భాషల్లో ప్రమోట్ చేశాడు. నన్ను మాత్రం పిలవలేదు. అయితే ఆ గ్యాప్‌లో నేను డబ్బింగ్ పూర్తి చేసుకున్నాను` అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు.
తాజాగా థ్యాంక్యూ మీట్లో కూడా ఆయన అదే విషయాన్ని మళ్లీ గుర్తు చేశారు. సినిమాను ప్రమోట్ చేయడానికి మా టీం రాత్రింబగళ్లు తిరిగారు, కానీ నన్ను మాత్రం వదిలేశారు అంటూ మనోజ్ సరదాగానే కామెంట్స్ చేసినప్పటికీ.. వెనుక ఉన్న ఆయన బాధ స్పష్టంగా వినిపించింది. నిజానికి మిరాయ్ లో మనోజ్ ఇచ్చిన ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుంటే ఆయన రీ-ఎంట్రీ మరింత హైలైట్ అయ్యేది. కానీ ఆ ఛాన్స్ దర్శకనిర్మాతలు ఆయనకు ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సినిమాల్లో ఒక స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమోషన్స్ మొత్తం హీరో చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. మిరాయ్ ప్రమోషన్స్‌లోనూ అదే జరిగింది. తేజను ఫ్రంట్‌లో పెట్టి.. మనోజ్‌ను తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేశారు.