భారీ ఉద్యోగాల కుంభకోణానికి బాధితులుగా మారిన కేరళకు చెందిన నర్సులు దుబాయ్ లో బిక్కుబిక్కుమంటూ సమయం గడుపుతున్నారు. గత ఏడాది అక్టోబరు నెల నుంచి కేరళ నర్సులు బ్యాచ్ లుగా ఉద్యోగాల నిమిత్తం దుబాయ్ కి వెళ్తున్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్ సెంటర్లలో పని చేసేందుకు చాలామంది నర్సులు అవసరం ఉన్నారని.. దుబాయ్ హెల్త్ కేర్ సంస్థలు ఇప్పటికే నియామకాలు చేపట్టాయని కొందరు మోసగాళ్లు కేరళ నర్సులను బురిడీ కొట్టించారు. అయితే ఉద్యోగావకాశాలు నిజంగానే ఉన్నాయని భావించిన కేరళ రాష్ట్ర నర్సులు మోసగాళ్లకు లక్షల రూపాయల్లో కుమ్మరించారు. ఒక్కొక్క నర్సు మోసగాళ్లకు 2 లక్షల రూపాయలు చెల్లించి దుబాయ్ లోకి ప్రవేశించారని అక్కడి అధికారులు వెల్లడించారు.

దుబాయ్ హెల్త్ కేర్ సంస్థలు నెలకి సుమారు 90 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తున్నాయని చెప్పగానే చాలా మంది ఆశ తో ముందు వెనుక ఆలోచించకుండా మోసగాళ్ల మాటలు విని దారుణంగా మోసపోయారు. అయితే విజిటింగ్ వీసా తో దుబాయ్ లో అడుగు పెట్టిన తర్వాత రెండు వారాలు క్వారంటైన్ లో గడిపామని.. కానీ తమకు ఆస్పత్రుల నుంచి నియామకాలకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేదని.. చివరికి మోసపోయామని అర్థం చేసుకున్నామని.. దుబాయ్ ఆసుపత్రుల్లో పని చేసేందుకు తమ దగ్గర లైసెన్స్ పత్రాలు కూడా లేవని తాము తెలుసుకున్నామని కేరళ నర్సులు చెప్పుకొచ్చారు.

అయితే దయనీయమైన పరిస్థితులలో ఒంటరి పక్షులుగా మిగిలిపోయిన నర్సుల బాధను అర్థం చేసుకున్న విపిఎస్ హెల్త్ కేర్ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇస్తోంది. ఇప్పటికే 90 మంది నర్సులను తమ ఆసుపత్రిలో నియమించింది. మరోవైపు నర్సులను బురిడీ కొట్టించిన మోసగాళ్లను కేరళ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఫిరోజ్ ఖాన్, అతని సహచరులను అరెస్టు చేశారు. కేరళ నుంచి ఢిల్లీకి పారిపోతుండగా పోలీసులు వీరిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఒక నర్సు ఇచ్చిన సమాచారం తో ఫిరోజ్ ఖాన్ ని పట్టుకోగా.. అతడి చేతిలో ఇప్పటికే ఐదు వందల మంది నర్సులు మోసపోయారని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: