అమెరికాలో తెలంగాణ వారు కలిసి స్థాపించిన తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకల్ని నిర్వహించింది.లాస్ ఏంజిల్స్ సిమీ వ్యాలీలోని ఇండియన్ ఒవెన్ బ్యాంకెట్ హాల్లో ఈ వేడుకలు జరిగాయి. భగవంతుడు తన ప్రతిరూపంగా భూమిపై అమ్మను సృష్టించాడని ప్రపంచలో గొప్పస్థానం ఒక్క అమ్మకే దక్కుతుందని అంటారు.
నవమాసాలు మోసీ కనీ పెంచి తన పిల్లల కోసం జీవితం మొత్తం త్యాగం చేసే మాతృమూర్తిని ఏడాదికి ఒకసారి ఇలా గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లుల కోసం ఇలాంటి రోజు ఒకటి ఉండటం పట్ల తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వేడుకను మరుపురాని కార్యక్రమంలాగా జరిపారు.
టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ హరిందర్ తల్లపల్లి.. రీజనల్ కోఆర్డినేటర్లు శిరీష తల్లపల్లి, ప్రవీణ కాసనగొట్టు, బిందు గండె, సరిత, సుచరిత రామాపురం తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.ఈ వేడుకకు పెద్ద ఎత్తున మహిళలు హాజరై.. టాటా చేపడుతున్న కార్యక్రమాల్ని అభినందించారు. టాటా సభ్యత్వం కోసం రిజిస్టర్ చేయించుకున్నారు. మహిళా సాధికరత దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
పాటలు.. కూచిపూడి నృత్యాలు.. సూపర్ మామ్ పోటీ.. కామెడీ స్కిట్లు.. టాలెంట్ షో.. ఫ్యాషన్ షో.. ఇలా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలతో మదర్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగిపోయాయి. అంతే కాదు ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళలు తమ అనుభవాలు పంచుకోవడంతో పాటు ఉత్సాహంగా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.