ఎన్నికల తరువాత ఎక్కువ శృతిలో బీభత్సమైన విమర్శలు. ఒక పక్క దారుణమైన ఓటమి రెండు చోట్ల పోటీ చేసినా ఫలితం లేదు. ఇంత జరిగిన తరువాత అక్కడ ఏం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారని ప్రజలు అనుకున్నారో, లేక ఆయన చెప్పిందాంట్లో అర్థం పర్థం లేదని భావించారో మొత్తం మీద ఓ రేంజ్ లో తీర్పునిచ్చారు. ఆయన రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారు. చివరాఖరికి ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన పార్టీ. ఇంత పెద్ద ఓటమి నుంచి కోలుకోవాలంటే అంత తొందరగా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే పవన్ చాలాకాలం నిశ్శబ్దంగా ఉండిపోయారు.

రెండు నెలల తరువాత ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ శ్రేణులకు ఆయన అందుబాటులోకి వస్తున్నారు. పార్టీ నాయకులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.అయితే పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో చాలా మందికి రుచించడం లేదని సమాచారం. అంతేకాదు వారిలో కొందరు పవన్ కళ్యాణ్ తీరును బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరికొంతమంది నేతలైతే ఇక ఈయన మారేలా లేరని తమ దారి తాము చూసుకుంటున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పేరున్న నేతలు పలువురు పక్క చూపులు చూస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి రామారావు పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ రాజీనామా చేయడం గోదావరి జిల్లాలో కలకలం రేపుతుంది.పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అధ్యక్షుని తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన చుట్టూ పవన్ ఒక కోటరీని తయారు చేసుకొని పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను కలవాలంటే అంత ఈజీ కాదని ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పోటీ చేసిన వారే ఆవేదన చెందుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. పవన్ దర్శనం కావాలంటే ముందు కోటరీ నేతలను ప్రసన్నం చేసుకోవలసి వస్తుందని వారికి డబ్బు యావ తప్ప మరొకటి లేదని పార్టీని విడిచిపెడుతున్నవారు పబ్లిక్ గానే ధ్వజమెత్తుతున్నారు.


ఈ మధ్య పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా చోట్ల నేతలు ఆగ్రహంతో ఉంటున్నారు.గత ఎన్నికల్లో తణుకు నుంచి జనసేన పార్టీ రెబల్ గా పోటీ చేసిన రామచంద్రరావు అనే వ్యక్తిని ఈ మధ్యనే ఆ నియోజక వర్గ ఇన్ చార్జ్ గా నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిని ఎలా ప్రోత్సహిస్తారంటూ రాజీనామా చేసిన పసుపులేటి రామారావు ఫైరవుతున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన పార్టీ ఏం చేస్తుంది, నియోజక వర్గాల వారీగా సమీక్షలు చేసుకొని తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు వేస్తున్న కమిటీల పట్ల సీనియర్ నేతలు సైతం అసంతృప్తితో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.


రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా నాదెండ్ల మనోహర్ ను నియమించటం ఆ పార్టీలోని పలువురు నేతలకు రుచించడం లేదట.ఎప్పట్నుంచో ఉన్న నేతలను కాదని ఎన్నికలకు ముందు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను ఎలా నియమిస్తారంటూ వారు ఆగ్రహంతో ఉన్నారట. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు వినూత్నంగా ఆచరణీయంగా ఆలోచనాత్మకంగా వుంటాయని జనసేన కార్యకర్తలు అభిమానులు భావించారు. ఆ దిశగా అడుగులు పడకపోగా మరింత నష్టం కలిగించే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని అభిమానులు ఆందోళనలో పడిపోయారట.


ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత పలువురు బలమైన నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడానికి పవన్ వైఖరే కారణమని చెప్పుకొంటున్నారు. అద్దేపల్లి శ్రీధర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు కోశాధికారిగా సేవలందించిన రాఘవయ్య పార్టీ వీడటం దీనికి నిదర్శనం అని అంటున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేలుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని లేదంటే పార్టీ మరింత పాతాళంలోకి పడిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: