తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం క్రమంగా ముదురుతోంది. కొంతకాలం ఒకే పార్టీలో ఉన్నా.. దారులు వేరయ్యాక వీరిద్దరిదీ ఎప్పుడూ ఎడమొఖం పెడమొఖమే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధాటికి తట్టుకోలేక.. 2009 ఎన్నికల ముందు.. అవసరం మేరకు చేతులు కలిపారు. అదీ చాలా కొద్ది కాలం మాత్రమే.. మళ్లీ 2009 ఎన్నికల తర్వాత ఎవరి దారి వారిదే. వైఎస్ హఠాన్మరణం తర్వాత.. తెలంగాణ ఉద్యమం మరింత జోరందుకున్నాక.. వీరి మధ్య ఘర్షణ వైఖరి క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2014 ఎన్నికల ముందు అది పరాకాష్టకు చేరింది.
ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఒకాయన తెలంగాణ సీఎం అయ్యాడు. ఇంకొకాయన ఏపీ సీఎం అయ్యాడు. ఇద్దరూ ముఖ్యమంత్రులే అయినా.. వైఖరిలో మాత్రం మార్పులేదు. ఇద్దరిలో పోటీ తత్వం పెరిగిపోయాక.. ఇది ఇంకాస్త ముదిరింది. ఒకరి వైఖరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన కారణంగా తలెత్తిన సమస్యలు వీరి మధ్య విభేదాలు మరింతగా పెంచాయి. ఒక్కో ఇష్యూపై ఇద్దరూ నీది తప్పంటే.. నీదే తప్పని దెప్పిపొడుచుకుంటున్నారు.
బుధవారం కేసీఆర్.. చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. చంద్రబాబు తెలుగు వాళ్లు కలిసి ఉందామంటూనే కారం బెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో చంద్రబాబు తెలంగాణకు అడ్డంపడుతున్నాడని విమర్శించారు. దీనికి స్పందనగానో ఏంటో కానీ.. చంద్రబాబు కూడా అదే రేంజ్ లో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కంటే ఇంకొక డోసు ఎక్కువగానే మాటల దాడి మొదలుపెట్టాడు. చివరకు కేసీఆర్ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని అనేశాడు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో కేసీఆర్ ఏపీ విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోకుండా పిచ్చి తుగ్లక్ లా మొండిగా వెళ్తున్నారని కామెంటే చేశాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: