కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలను సీఎం జగన్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉ‍న్నారు.
                  హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం జగన్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా కేంద్ర మంత్రులతో జగన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో విగ్రహాల ధ్వంసానికి సంబంధించి సీఐడీ రిపోర్టును కేంద్రానికి సీఎం జగన్ అందజేయనున్నట్లు సమాచారం. ఇక అంతర్వేది రథం దగ్ధం అంశంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో.. దీన్ని వెంటనే నియమించాలని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆ కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీతో సమావేశం అవ్వాల్సి ఉండగా.. ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంతో బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు. కాగా జగన్ పర్యటనపై ప్రతిపక్ష టీడీపీ పలు ఆరోపణలు గుప్పిస్తుంది. ఎవరి కాళ్లు పట్టుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్లారని మాజీ మంత్రి ఉమా ఎద్దేవా చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: