వాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి ఎలా భయపెట్టిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ముఖ్యంగా యూరప్ దేశాలు, అగ్రరాజ్యం అమెరికాలో ఈ మహమ్మారి విలయ తాండవమే చేసింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. మరి యూఎస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఈ విపత్తును తట్టుకునేందుకు ట్రంప్ ఏం చేయాలని అనుకున్నారు? కరోనాపై పోరుకు ఏం ప్లాన్ చేశారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావించారు? అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఇదిగో ఇన్ని రోజుల తర్వాత.. అది కూడా ట్రంప్ తన అధ్యక్ష పదవి వీడి వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది. అయితే ఇది విన్న వాళ్లు మాత్రం షాక్ తింటున్నారు. ఆశ్యర్యంతో ముక్కున వేలు వేసుకుంటున్నారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటో తెలియాలంటే అసలు విషయం తెలుసుకోవాలి.

ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ గురించి బైడెన్ పాలక వర్గంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిలో ఉన్న రాన్ క్లెయిన్ మాట్లాడారు. ‘‘మేం వైట్‌హౌస్‌లోకి వచ్చినప్పుడు.. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఎటువంటి విధానమూ లేదు’’ అని షాకింగ్ విషయం వెల్లడించారు. దేశంలో లక్షలాది వ్యాక్సిన్ల పంపిణీ జరిగినప్పటికీ.. వాటిలో కేవలం సగం మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని క్లెయిన్ వెల్లడించారు. ఈసారి జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా మహమ్మారిపై పోరు కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో బైడెన్ గెలవడానికి ఇది కూడా ఓ కారణమే. కరోనాను ఎలా నియంత్రించాలి అనే విషయంపై బైడెన్ ఓ ప్లాన్ ప్రపోజ్ చేశారు. కానీ ట్రంప్ ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటనలు ఏవీ రాలేదు. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: