ఏపిలో పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు విడతల పోలింగ్ ను పూర్తి చేసుకున్న ఈ ఎన్నికలు ఇప్పుడు మూడో విడత ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసింది. ఈ ఎన్నికలు కుడా ఒకేసారి ఉదయం 6.30 నుంచి మొదలైంది. పోటీలో ఉన్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్యం అదేరోజు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ మొదలు కానుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ను కూడా మొదలు పెట్టనున్నారు. 


ఈ విడతలో 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు 2,639 సర్పంచ్‌ పదవులకు బుధవారం ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో నిలబడ్డారు.



మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 3,127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ 7,245 కేంద్రాలలో పోలింగ్‌ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ ప్రక్రియలో 76,019 మంది సిబ్బంది పాల్గొంటుండగా, 4,780 మంది పోలింగ్‌ పర్యవేక్షణ విధులలో పాల్గొననున్నారు. కరోనా తో పోరాడుతున్న వారు కోసం ప్రత్యేక సమయాన్ని ఏర్పాటు చేశారు. అరగంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మొదట ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్‌ పదవి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం 63,270 మంది హాజరు కానున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: