పంచాయితీ ఎన్నిక‌లు ముగిశాయి. ప్ర‌లోభాల ప‌ర్వం ముగిసింది. పుర‌పాల‌క సంఘాల ఎన్నిక‌ల‌కు తెర‌లేవ‌డంతో అధికార పార్టీ అరాచ‌కాలు, దౌర్జ‌న్యాల‌కు కూడా తెర‌లేచింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెందిన అభ్య‌ర్థుల‌ను లొంగ‌దీసుకునే క్ర‌మాన్ని తార‌స్థాయికి తీసుకువెళ్లారు. ఎవ‌ర్ని ఎలా బెదిరిస్తే దారికొస్తారో అలాగే బెదిరిస్తూ త‌మ‌కు కావ‌ల్సిన‌వాటిని సాధించుకుంటున్నారు. ప్ర‌జాస్వామ్యానికి అర్థం లేకుండా చేస్తున్నారు.

పురపోరులో అధికారపార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. వ్యాపారవర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అయితే వారిని తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. ఇంకోవైపు డబ్బు ఆశచూపి లొంగదీసుకునే ప్ర‌య‌త్నాలు తీవ్ర‌మ‌య్యాయి. వీటిని తట్టుకోలేక మార్కాపురంలో మున్సిపల్‌ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అక్కడ జనసేన, బీజేపీ కూటమి అవకాశం ఉన్నన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి.

ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు కందుల నారాయణ రెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు ఆయా డివిజన్లకు నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అభ్యర్థులను బెదిరించటం, వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని హెచ్చరించటం, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించటం లాంటి చర్యలతో తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలు ఆందోళనకు గురైనట్లు నారాయణరెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలను తట్టుకోవడం కష్టమనే భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఎన్నికలను బహిష్కరించినా ఇంటింటికీ తిరిగి అధికారపార్టీ వ్యవహారశైలిని వివరిస్తామని ప్రకటించారు.

ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్ర‌క‌టించ‌డంతో జనసేన, బీజేపీ కూటమి పోటీకి సిద్ధమైంది. ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి నారాయణరెడ్డి నాయకత్వాన్ని విభేదించి జనసేనలోకి వెళ్లిన ఇమ్మడి కాశీనాథ్‌ ఆధ్వర్యంలో పోటీకి సిద్ధం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన తరఫున అప్పట్లో 17 వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 13మందికిపైగా అభ్యర్థులతో ఆయన ఒక పుణ్యక్షేత్రంలో క్యాంపు ప్రారంభించారు.  వీరిని కూడా పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. వీరు కాకుండా మరో ఐదు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని త‌మ స‌త్తా ఏమిటో నిరూపించాల‌నే ప‌ట్టుద‌ల‌తో బీజేపీ-జ‌న‌సేన కూట‌మి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: