టిడిపి తరపున గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దమ్ముంటే ఆ ముగ్గురు నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని పేర్కొన్నారు. టిడిపి నగర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బలమేంటో తేటతెల్లమైందన్నారు. కెసిఆర్‌పై ప్రజలకు విశ్వాసం లేదని వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లోనే టిఆర్‌ఎస్‌ నేతలను ప్రజలు తరిమికొడతారని అన్నారు. కెసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల సంపాదనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. గ్రేటర్‌లో ఎన్నికల్లో టిడిపి సత్తా చూపి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టిడిపికే అనుకూలంగా ఉన్నాయని, కెసిఆర్‌ చేయించుకున్న సర్వేలోనూ అదే వెల్లడైన విషయాన్ని తెలిపారు. అందుకే ఎన్నికలు నిర్వహించడానికి కెసిఆర్‌కు ధైర్యం చాలడం లేదన్నారు. పార్టీ అధ్యక్షులు ఎల్‌.రమణ మాట్లాడుతూ గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌ ఉనికి కాపాడుకోవడానికి ఇతర పార్టీల నుంచి నాయకులను అరువు తీసుకున్నారని విమర్శించారు. గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌ బలం పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నారని అన్నారు. అయితే అది బలం కాదు..వాపని ఎంఎల్‌సి ఎన్నికలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపిబిజెపి కూటమికే విజయావకాశాలున్నాయని అన్నారు. నగరంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని నగర అధ్యక్షులు సి.కృష్ణయాదవ్‌ అన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్‌, నాయకులు నైషదం సత్యనారాయణమూర్తి, శ్రీశైలం యాదవ్‌, మేకల సారంగపాణి, నాయకులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: