బీజేపీలో అంతర్గత పోరు..!మరీ ఆపేదెవరు..?

ఒకప్పుడు తెలంగాణ ప్రజలకు బిజెపి పార్టీ అంటే ఏమిటో తెలియదు.  కనీసం ఎక్కడైనా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా వచ్చేవి కావు.  అలాంటి పార్టీ తెలంగాణలో ఒక మార్కు రాజకీయం చేస్తుందని చెప్పవచ్చు. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గద్దెనెక్కడం కోసం తమదైన శైలిలో రాజకీయాన్ని నడుపుతోంది. ఇప్పుడున్న టిఆర్ఎస్,  కాంగ్రెస్ పార్టీల అసంతృప్తి నాయకులకు   ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపి కనిపిస్తోంది.  ఈ విధంగా  రాష్ట్రంలో ఎదుగుతున్న పార్టీలో కొంతమంది  పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని కొన్ని సంఘటనలు చూస్తే చెప్పవచ్చు. చిన్న చిన్న అంతర్గత విభేదాలు నాయకుల మధ్య  రచ్చకెక్కుతూన్నాయి.

 పెద్దపల్లి  బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న  మాజీ ఎమ్మెల్యే,  మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ,  మాజీ ఎంపీ బిజెపి కేంద్ర సమన్వయ కమిటీ పరిశీలకుడు జి వెంకటస్వామిల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు చిలికి చిలికి పాకం అయినట్టు,  రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పార్టీకి సంబంధించిన సమావేశాలు,  ఇతరత్రా కార్యక్రమాలు జరిగినప్పుడు జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ తన అనుకూల వర్గానికి మాత్రమే  సమాచారం ఇచ్చి,  వివేక్ అనుకూల వర్గానికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు.  ఈ విధంగా ప్రవర్తిస్తూ గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాను ఏ పార్టీలో ఉన్నా తన పెత్తనమే నడవాలని,  తను చెప్పిందే వినాలని టార్గెట్ పెట్టడం వివేక్  వర్గీయులకు మింగుడు పడడం లేదు.  అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు  కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే  కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

 అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న బిజెపిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వర్గాలుగా ఏర్పడి బిజెపి సంబంధించిన కార్యక్రమాలు ఒకే జిల్లాలో వేర్వేరుగా చేస్తే పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని,  కార్యకర్తల మనోభావాలు  దెబ్బతింటాయని ,  పలువురు బీజేపీ సీనియర్  నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా రామగుండం కార్పోరేషన్,  పెద్దపల్లి జిల్లాలో నియమిస్తున్న  కమిటీల్లో పార్టీలో  పనిచేయని తన   వర్గానికి పదవులను ఇస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని సీనియర్ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ మధ్యనే పార్టీలో పనిచేయని ఓ మహిళా నాయకురాలికి పార్టీ పదవులు కట్టబెట్టడం విభేదాలకు ఆజ్యం  పోసినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం గుర్తించి విభేదాలు సర్దుమణిగేలా   చూడాలని నాయకులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: