ఆ రాష్ట్రంలో నాలుగు ద‌శాబ్దాల త‌ర్వాత ఓ మ‌హిళా మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు నెల‌లు అవుతోన్న వేళ పుదుచ్చేరిలో బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రంగ‌స్వామి కాంగ్రెస్ మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు.  ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు మంత్రివర్గం జాబితాను గవర్నర్ ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు ఇచ్చారు. ఈ మంత్రి వ‌ర్గ జాబితాకు ఎట్ట‌కేల‌కు కేంద్రం కూడా ఆమోద‌ముద్ర వేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 40ఏళ్ల తర్వాత ఓ మహిళకు మంత్రి పదవి దక్క‌డం ఓ రికార్డుగా నిలిచింది.

అప్పుడెప్పుడో 1980-1983లో కాంగ్రెస్-డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుక అప్పాదురై మంత్రిగా ఉన్నారు. ఆ త‌ర్వాత 40 ఏళ్ల‌లో అక్క‌డ ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మ‌హిళా మంత్రి లేరు. మ‌ధ్య‌లో ఎన్నో సార్లు మ‌హిళా ఎమ్మెల్యే ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని డిమాండ్ చేసినా. ఈ డిమాండ్ల‌ను ఏ ప్ర‌భుత్వాలు కూడా ప‌ట్టించుకోలేదు. అయితే ఇప్పుడు రంగస్వామి కేబినెట్‌లో కారైక్కాల్‌ ప్రాంతంలో నెడుంగాడు గెలిచిన మ‌హిళా ఎమ్మెల్యేకు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

నెడుంగాడు రిజర్వుడు స్థానం నుంచి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన చందిరా ప్రియాంగాకు మంత్రి పదవి దక్క‌డంతో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో మ‌హిళ‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఆదివారం మంత్రుల ప్ర‌మాణ స్వీకారం రాజ్‌భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నుంది. ఇక బీజేపీ - ఎన్ ఆర్ కాంగ్రెస్ క‌లిసి సంయుక్తంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బీజేపీకి చెందిన నమశ్శివాయం, సాయి శరవణన్‌ కుమార్ కు కూడా కేబినెట్లో ప‌ద‌వులు ద‌క్కాయి. ఇక కోవిడ్ కార‌ణంగా కేవ‌లం 100 మందితోనే ఈ కార్య‌క్రమం నిర్వ‌హిస్తున్నారు. మొత్తం 15 నిమిషాల్లో ఈ కార్య‌క్ర‌మం ముగియ‌నుంది.

ఇక ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తోన్న రంగ‌స్వామి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యానాం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోగా.. మ‌రో చోట గెల‌వ‌డంతో ఆయ‌న అసెంబ్లీలో అడుగు పెట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: