విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం ప్రదర్శించినా సరే... వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సరైన పని తీరు కనబరచని వారికి తక్షణమే మెమో జారీ చేయాలని సూచించారు. దాదాపు రెండు నెలల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిన్నటీ నుంచి ప్రారంభమైంది. దీనిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. కొందరు అధికారులు కనీసం సచివాలయాలకు కూడా వెళ్లడం లేదని... అక్కడి సిబ్బందినే తమ కార్యాలయాలకు రప్పించుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలను వారానికి నాలుగు సార్లు తప్పనిసరిగా సందర్శించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.

కొందరు అధికారులు సచివాలయాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని జగన్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అక్కడి సమస్యలు తెలుస్తాయన్నారు. తప్పులు జరిగితే... వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు జగన్. కలెక్టర్లు, జేసీ పనితీరుపై జగన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు, జేసీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదే తరహాలో అధికారులు కూడా పనిచేయాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు రైతు భరోసా, అర్బన్ హెల్త్ క్లినిక్కులు, తదితర అంశళాలుపై తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి రివ్యూ నిర్వహించారు. అటు పర్యాటక రంగం ప్రారంభం కావడంతో అన్ని ప్రదేశాలకు కూడా పర్యాటకుుల తాకిడి ఎక్కువగా ఉందని... థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు. అధికారులు తప్పనిసరిగా ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారితనంతో పనిచేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: