
తాజాగా మరొక ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్ నగరంలో అఫ్ఘన్ స్థానికులపై తాలిబాన్లు కాల్పులు జరిపారు. జలాలాబాద్ నగరంలో తాలిబన్లు తమ జెండాను ప్రదర్శిస్తూ.. ఇదే అఫ్ఘనిస్తాన్ జండా అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే దేశ జెండాను మార్చవద్దని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా తాలిబాన్ జెండాను తొలగించి.. అఫ్ఘన్ త్రివర్ణ పతాకాన్ని బహిరంగంగా ఎగరవేశారు. దీంతో తాలిబాన్లు తమ రాక్షస రూపాన్ని బయటపెట్టారు. ఈ ఉగ్రవాదులు అఫ్ఘన్ ప్రజలపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు తిరుగుబాటుదారులు చనిపోయారని సమాచారం. పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డారని తెలుస్తోంది.
ఈ భయానక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులు జరిపినట్లు వినొచ్చు.
తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ దేశ ప్రజలు ప్రాణాలను సైతం కోల్పోవడానికి సిద్ధం కావడం గమనార్హం. దేశ ప్రజలలో ఉన్న ధైర్యాన్ని అఫ్ఘన్ ఆర్మీ కలిగి ఉన్నట్లయితే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి దేశాన్ని పాలకుల చేతిలో అప్పజెప్పిన పలాయనం చిత్తగించిన ఆ దేశ సైనికులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్త్ర సన్యాసం చేయడంవల్ల అమెరికా యుద్ధ సామాగ్రినంతటా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆయుధాలతోనే అడ్డుఅదుపు లేకుండా పెట్రేగిపోతున్నారు. ఇటీవల బుర్కా ధరించనందుకు ఒక మహిళను కూడా చంపినట్లు వార్తలు వస్తున్నాయి.