కేసీఆర్ దేశ రాజకీయాల్లో పాగా వేయాలనుకుంటున్నారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడతానంటున్నారు. ప్రజలు మద్దతిస్తే దేశ రాజకీయాల్లో తన సత్తా చూపిస్తానని, ప్రధాని నరేంద్రమోదీని దేశం నుంచి తరిమేస్తానంటూ సవాళ్లు విసురుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, మరి దక్షిణాది నుంచి ఓ నాయకుడు వెళ్లి ఢిల్లీ కోటలు బద్దలుకొట్టే రోజులు ఇప్పుడు ఉన్నాయా..? తెలంగాణ నుంచి కేసీఆర్ వెళ్లి ఢిల్లీలో సత్తా చూపిస్తానంటే కలసి వచ్చేవారెందరు..? కాదు పొమ్మనేవారెంతమంది..? ఇప్పటికే ఢిల్లీ గద్దెపై ఆశలు పెట్టుకున్న నేతలు, కేసీఆర్ కి మద్దతిస్తారో లేదో వేచి చూడాలి.

మమతా బెనర్జీ కలసి వచ్చేనా..?
ఇప్పుడు కేసీఆర్ సవాళ్లు విసిరినట్టే, గతంలో మమతా బెనర్జీ కూడా మోదీపై గట్టిగా మాట్లాడేవారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆమె మోదీని ఢీ కొట్టడానికి సై అన్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేశ రాజకీయాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ పోరులో టీఎంసీని రంగంలోకి దింపుతున్నారు.

ఆమ్ ఆద్మీ సత్తా ఎంత..?
ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉంది. అన్నీ అనుకూలిస్తే పంజాబ్ లో కూడా ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశముందని ప్రీపోల్స్ చెబుతున్నాయి. మరి పంజాబ్ లో పాగా వేయగలిగితే కేజ్రీవాల్ క్రేజ్ పెరిగినట్టే కదా, అప్పుడు కేజ్రీ ఎందుకు వెనక్కి తగ్గుతారు. రెండు మూడు రాష్ట్రాలను ప్రభావితం చేసే సత్తా తన దగ్గరున్నప్పుడు మిగతా ఎవరో వచ్చి మోదీకి నేనే అసలైన ప్రత్యర్థి అంటే కేజ్రీవాల్ మద్దతు ఇవ్వగలరా..? ఇస్తారా..?

ప్రస్తుతానికి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలుపుకొని వెళ్తున్నారు. కానీ స్టాలిన్ యూపీఏ భాగస్వామి. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, కేసీఆర్ తో కలసి నడుస్తారా.. లేక ఇప్పుడున్నట్టే తటస్థంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ఎన్నికల ముందు అయితే జగన్ సాహసం చేయరు. ఎన్నికల తర్వాత అవసరం అనుకుంటే కేసీఆర్ కి మద్దతిస్తారు. అంతవరకు గ్యారెంటీ. ప్రస్తుతానికయితే మమతా బెనర్జీ, కేజ్రీవాల్.. వీరిద్దరితోనే కేసీఆర్ కి తలనొప్పి.

మరింత సమాచారం తెలుసుకోండి: