ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తొలి ట్రిప్ లో కొంతమంది రాగా, రెండో దఫా మరికొంతమంది భారత్ కు వస్తారని చెబుతున్నారు. ఉక్రెయిన్ లో మొత్తంత 1100మంది తెలుగు విద్యార్థులున్నట్టు ప్రభుత్వాల వద్ద సమాచారం ఉంది. వీరిలో 700మందికి సంబంధించిన పూర్తి సమాచారం, అంటే పేరు, ఊరితోపాటు.. ప్రస్తుతం వారు ఎక్కడ తలదాచుకున్నారు, ఎలా భారత్ కి రావాలనుకుంటున్నారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. 350మంది ఏపీకి చెందినవారు కాగా.. మిగతా వారు తెలంగాణ, ఇతర ప్రాంతాలవారు. ఇప్పుడు వీరంతా సొంత ప్రాంతాలకు వచ్చేస్తున్నారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన వెంటనే భారత విద్యార్థులకోసం కేంద్ర ప్రభుత్వం ఓ విమానాన్ని పంపింది. కానీ ఉక్రెయిన్ గగన తలంపై ఆంక్షలు ఉండటంతో విమానం తిరిగొచ్చింది. ప్రస్తుతం సరిహద్దులు దాటి రొమేనియాకి వచ్చినవారిని విమానాల ద్వారా భారత్ కి తరలిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కృషి ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కూడా తాపత్రయ పడుతున్నాయి.

ఉక్రెయిన్ విద్యార్థులతో ఫోన్లో మాట్లాడటం, వీలైతే జూమ్ కాల్స్ లో మాట్లాడటం, వారిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామనే భరోసా ఇవ్వడం అందరు నాయకులు మొదలు పెట్టారు. ఏపీలో ప్రభుత్వం సమీక్ష నిర్వహించిన వెంటనే, ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ కాల్ లో విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా విద్యార్థులతో ఫోన్ కలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులు భయపడొద్దని చెప్పారాయన. అదే సమయంలో భారత్ లోనే వైద్య విద్య కళాశాలల స్థాపనకు కేంద్రం కృషిచేస్తోందని, రాష్ట్రాలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలేదని పొలిటికల్ కామెంట్స్ కూడా విసిరారు. అటు తెలంగాణలో కూడా ఇదే విషయంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఆ క్రెడిట్ తమదంటే తమదంటూ వాదించుకుంటున్నాయి.

మొత్తమ్మీద ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్న క్రమంలో ఇక్కడి రాజకీయ పార్టీలు మాత్రం ఆ ఘనత మాదంటే మాదని చెప్పుకోవడం విశేషం. అది ఎవరి గొప్ప అయినా విద్యార్థులు క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఇక్కడ సంతోషించదగ్గ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: