టీడీపీ మహానాడు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని చెబుతున్నారు నిర్వాహకులు. తొలిరోజు మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని చెబుతున్నారు. మొత్తం ఈ కార్యక్రమంలో 17 తీర్మానాలు ఆమోదించారు. చంద్రబాబు సహా ఇతర నేతల ప్రసంగాలకు మంచి స్పందన వచ్చింది. క్విట్ జగన్ - సేవ్ ఏపీ పేరుతో తమ పోరాటం మొదలు పెట్టాలనుకుంటున్నారు టీడీపీ నేతలు. ఈ పొలిటికల్ విషయాలను పక్కనపెడితే.. మహానాడు కార్యక్రమంలో టీడీపీకి భారీగా విరాళాలు అందాయనే విషయం తెలుస్తోంది.

దాదాపుగా కార్యక్రమం ఖర్చునంతా పార్టీయే భరిస్తుంది. అయితే రాను రాను నాయకులు ఒక్కో విభాగం ఖర్చు తాము భరిస్తామంటూ ముందుకొస్తున్నారు. వీరందరికీ పార్టీ అనుమతి ఇచ్చింది. అందుకే మహానాడులో విరాళాలు వెల్లువెత్తాయి. వస్తు రూపేణా వచ్చిన విరాళాలలో గుంటూరు నాయకుడు మన్నవ మోహన్ కృష్ణ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన 31 లక్షల రూపాయల విలువైన వాటర్ బాటిల్స్ ని మహానాడుకి తరలించారు. మహానాడుకి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తల దాహం తీర్చారు.

నగదు రూపంలో వచ్చిన విరాళాలలో కోవెలమూడి రవీంద్ర మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన కూడా గుంటూరుకి చెందిన నాయకుడు కావడం గమనార్హం. కోవెలమూడి రవీంద్ర పార్టీకి రూ.27 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇక మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పార్టీకి 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. దామచర్ల జనార్దన్‌, ఇంటూరి నాగేశ్వరరావు కూడా చెరో 25 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి, అదే జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ 20లక్షల విరాళం ప్రకటించారు. ఎంపీ గల్లా జయదేవ్ కూడా 20 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. బీసీ జనార్దన్‌, గొట్టిపాటి రవికుమార్‌ పార్టీకి 15 లక్షల రూపాయల విరాళం అందించారు. మిగతా నాయకుల్లో చాలా మంది పార్టీకి 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మొత్తమ్మీద.. ఈసారి మహానాడుకి తొలిరోజే విరాళాల వెల్లువ వచ్చిందని అంటున్నారు. గతం కంటే ఎక్కువగా ఈసారి నాయకులనుంచి స్పందన ఉందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: