ఏపీలో అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉండటం లేదనే అపవాదు ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం బ్రాండ్లపై రాజకీయాలేంటంటూ విపక్షాలపై విమర్శలు చేస్తోంది. డిమాండ్ ఉన్న బ్రాండ్లే మార్కెట్లో ఉంటాయని ఆమద్య డిస్టిలరీలు కూడా స్టేట్మెంట్లు ఇచ్చాయి. అయితే ప్రభుత్వం తీసుకోబోయే తాజా నిర్ణయంతో ఇకపై అన్ని బ్రాండ్లు ఏపీలో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక వైన్ షాపుల వేలం ఆపేశారు. ప్రభుత్వ దుకాణాల ద్వారా మందు అమ్మే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీని వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రావడంలేదని కేంద్రంలోని కొందరు పెద్దలు భావిస్తున్నారట. దీనికోసం మళ్లీ ప్రైవేటుకే నిర్వహణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే జరిగితే మద్యంలో అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అమ్మగలిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం. దాదాపు 20 వేల కోట్ల రూపాయలు. అంటే పెట్టుబడికి నాలుగురెట్ల ఆదాయం అన్నమాట. అయితే ఇది కూడా సరిపోవడంలేదని, అంతకంటే ఎక్కువ ఆదాయం రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయం ఎక్కువ రావాలంటే, లాభం అయినా పెరగాలి, లేదా వ్యాపారం అయినా ఎక్కువగా జరగాలి. ప్రభుత్వ విధానం మద్యంపై నియంత్రణ కాబట్టి, ప్రభుత్వం ద్వారా అమ్మే దుకాణాల్లో మద్యం అమ్మకాన్ని పెంచలేరు, ఆ అపవాదు మూటగట్టుకోలేరు. అందుకే ప్రైవేటుకే ఆ బాధ్యతలు అప్పగిస్తే ఆ తిప్పలేవో వారే పడతారు, షాపుల వేలం ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి మిగులుతుంది. ఈ ఉద్దేశంతోటే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

అదే నిజమైతే.. ప్రైవేటు వైన్ షాపులు వస్తే.. ఏపీలో మునుపటిలాగే పరిస్థితులు ఉంటాయి. ఎన్నికల వేళ మద్యపానం నిషేధం అనే హామీని ఇచ్చారు జగన్. అయితే అధికారంలోకి వచ్చాక, విడతలవారీగా మద్యపాన నిషేధం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు  మద్యపాన నియంత్రణ అనే పదం వినపడుతోంది. ప్రైవేటుకి అప్పగిస్తే మద్యపాన నియంత్రణ అనేది కూడా అసాధ్యం అయ్యేలా ఉంది. మరి వచ్చే ఎన్నికలనాటికి జగన్ ఈ హామీపై ప్రజలకు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: