
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ సడెన్ గా విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే డిసెంబర్ 4వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించటం. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పోలింగ్ ముగియగానే వెల్లడైన ఎగ్జిట్ పోల్ జోస్యాల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని తేలింది. ఎగ్జిట్ పోల్స్ లో ఓడిపోతుందని వచ్చినంత మాత్రాన నిజమవుతుందని అనుకునేందుకు లేదు.
ఎగ్జిట్ పోల్స్ నిజమవచ్చు కాకపోవచ్చు. అయితే డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వచ్చేటపుడు 4వ తేదీన క్యాబినెట్ సమావేశం ఎవరు నిర్వహించరు. పైగా 4వ తేదీన క్యాబినెట్ సమావేశమని డిసెంబర్ 1వ తేదీన నిర్ణయం తీసుకోవటమే విచిత్రంగా ఉంది. ఫలితాల సరళిని బట్టి పార్టీ అదినేత, ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవటం మామూలే. 3వ తేదీన ఫలితాల్లో బీఆర్ఎస్ దే అధికారమని అర్ధమైపోయిన వెంటనే 4వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు కేసీయార్ డిసైడ్ అవటంలో తప్పులేదు.
పైగా ఇపుడున్న 17 మంది మంత్రుల్లో తక్కువలో తక్కువ 13 మంది ఓటమిబాటలో ఉన్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నూరుశాతం నిజం కాకపోయినా ఎంతో కొంత నిజం అయ్యే అవకాశాలున్నాయి. మరదే జరిగితే ఎంఎల్ఏలుగా ఓడిపోయిన మంత్రులు క్యాబినెట్ సమావేశానికి ఎలా హాజరవుతారు అన్నది కీలకమైన పాయింట్. ఎంఎల్ఏగా ఓడిపోయిన మంత్రులు క్యాబినెట్ మీటింగుకు దూరంగా ఉండటం అన్నది నైతికత.
డిసెంబర్ 4వ తేదీన క్యాబినెట్ మీటింగని కేసీయార్ నిర్ణయించంటం వెనుక గెలుపుపై భరోసా ఇవ్వటమే అనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. నిజంగా ఇదే నిజమైతే ఇందులో అర్ధమేలేదు. ఎందుకంటే పోలింగ్ ముగిసిన తర్వాత కేసీయార్ ఎన్ని ప్రకటనలు చేసినా ఎలాంటి ఉపయోగముండదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే నవంబర్ 30వ తేదీన జనాలు తమ తీర్పును ఇచ్చేశారు. రిజర్వయిన తీర్పు డిసెంబర్ 3వ తేదీన వెలువడబోతోందంతే. ఇంతోటి దానికి కేసీయార్ ఇన్ని డ్రామాలు వేయటం అవసరమా అనే చర్చ పెరిగిపోతోంది.