ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు  బాగా వివాదాస్పదమవుతోంది. వివేకా హత్యలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని ఒకవైపు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా తెగ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో వివేకా కూతురు సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డే హత్యలో  కీలక పాత్రదారులని వైసీపీ నేతలు, జగన్ మీడియా పదేపదే ఎదురుదాడులు చేస్తోంది. రెండువైపులా వాదనలు, ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో మధ్యలో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.





హత్యజరిగిన దాదాపు ఐదేళ్ళు జగన్ పైన సునీత ఎలాంటి ఆరోపణలు చేయలేదు. హత్య నిందితులతో సంబంధమున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని జగన్ రక్షిస్తున్నారని మాత్రమే సునీత ఆరోపించారు. అవినాష్, భాస్కర్ పైన కేవలం సునీత ఆరోపణలు మాత్రమే చేస్తున్నారంతే. తన ఆరోపణలకు తగ్గట్లుగా ఆమె ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఆమె ఆరోపణల ఆధారంగా అవినాష్ ను నిందితుడిగా చేర్చిన సీబీఐ కోర్టు విచారణలో ఆధారాలను చూపటంలో చేతులెత్తేసింది.





ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో సునీత మాట్లాడుతు హత్యలో జగన్ పాత్రపైన కూడా దర్యాప్తుచేయాలని సీబీఐని డిమాండ్ చేయటం సంచలనంగా మారింది. సునీత ఆరోపణల వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ వెంటనే ఎదురు ఆరోపణలు చేస్తోంది. పైగా జగన్ మీడియాలో వివేకా హత్యలో సునీత, ఆమె భర్త పాత్రపైన వివేకా రెండోభార్య షమీమ్ ఆరోపణలను ప్రధానంగా హైలైట్ చేస్తోంది. అలాగే వివేకాకు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలకు ప్రాధాన్యతిస్తోంది. సీబీఐ విచారణలో  పీఏ మాట్లాడుతు కూతురు సునీత, ఆమె భర్త పాత్రపైనే ఆరోపణలు చేయటంతో విచారణ మరో మలుపు తీసుకున్నది.





మొత్తానికి వివేకా హత్యకు కారణం మీరేనంటే కాదు కాదు మీరేనంటు ఒకళ్ళపై మరకొళ్ళు ఆరోపణలు, ఎదురు ఆరోపణలు చేసుకుంటున్నారు. కోర్టులో విచారణ కూడా అనుకున్నంత స్పీడుగా జరగటంలేదు. పైగా హత్యను విచారించిన ఎస్పీ  రామ్ సింగ్ మొదట్లో కంపుచేసేశాడు. దాంతో ఇపుడు కొత్తగా విచారిస్తున్న అధికారులకు సరైన ఇన్ పుట్స్ రావటంలేదు. అందుకనే దర్యాప్తంతా కంపుగా తయారైపోయింది. చూస్తుంటే వివేకా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చేట్లు కనబడటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: