పౌరసేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందించేందుకు మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో ఎపి ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విజయవంతంగా ప్రజలకు సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరి 30వతేదీన మంత్రి లోకేష్ చేతులమీదుగా దేశంలోనే తొలిసారిగా 161రకాల పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రారంభించిన మనమిత్ర... కేవలం 50రోజుల్లోనే 200సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చు. పౌరసేవలను సమర్ధవంతంగా, సులభతరంగా అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలకు సౌలభ్యంతో పాటు పాలనలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో గత ఏడాది అక్టోబర్ 22న డిల్లీలో మంత్రి లోకేష్ మెటా ప్రతినిధులతో ఎపి ప్రభుత్వం తరపున ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల టెన్త్, ఇంటర్ విద్యార్థుల తమ హాల్ టిక్కెట్లను సైతం వాట్సాప్ ద్వారా పొందగలిగారు. ప్రజలు వివిధ రకాల పౌరసేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన మిత్ర నెం. 9552300009 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ప్రస్తుతం 200 రకాల పౌర సేవలను ఎపి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.


అందులో విద్య, దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు కూడా ఉన్నాయి. విద్యుత్తు బిల్లులు, పన్నుల చెల్లింపుల వంటి సేవలతో పాటుగా దేవాలయాల్లో దర్శనాలు, వసతి గదుల బుకింగ్, విరాళాల సమర్పణకు ఇది ఉపయోగపడుతోంది. అలాగే పర్యాటక ప్రదేశాల సమాచారం, టికెట్ బుకింగ్ వంటివి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లు కూడా సులభంగా పొందొచ్చు. అధునాతన సాంకేతికత వినియోగం ద్వారా ప్రజలకు పౌరసేవలను ఇంటిముంగిటికే తీసుకెళ్లడం విప్లవాత్మకమైన పరిణామం. వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ ప్లాట్ ఫాంగా పలురకాల పౌరసేవలను ప్రజలకు అందిస్తుంది.


మూడు ప్రాథమిక నమూనాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డెలివరీ ప్లాట్ ఫాంగా వాట్సాప్ సేవలను అందించే లక్ష్యం ఎపి ప్రభుత్వం మెటాతో కుదుర్చకున్న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 1).G2C (ప్రభుత్వం నుండి పౌరులకు), 2).B2C (వ్యాపారం నుండి వినియోగదారునికి) 3).G2G (ప్రభుత్వం నుండి ప్రభుత్వం). ఈ మేరకు తొలివిడతలో పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే వాణిజ్యరంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్ డెలివరీ కోసం రీ ఇంజనీరింగ్  ప్రక్రియ ద్వారా మనమిత్ర సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వశాఖల అంతర్గత కార్యకలాపాలకు సైతం దీనిని వినియోగిస్తారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా వేగవంతంగా ప్రజలకు ప్రభుత్వసేవలు అందనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: