దేశ రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 9న పోలింగ్ జరగనుండగా, పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశముంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే, ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండీ కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టే యత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కూటమి తరపున ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే పేరే బలంగా వినిపిస్తోంది. ముసలితనం, అనుభవం, శాసనసభ పరిపక్వత – ఈ మూడు అంశాలు ఖర్గేకు ప్లస్ కావొచ్చు.


అంతేకాదు, అధికార ఎన్డీయే కూటమి కూడా అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే – మోడీ ఇప్పటికే తన అభ్యర్థిని ఖరారు చేశారట! అందరి దృష్టి ఇప్పుడు అమిత్ షాపైనే ఉంది. కేంద్ర హోంమంత్రిగా సేవలందిస్తున్న షా – ప్రస్తుతం అద్వానీ తర్వాత అత్యధికకాలం హోంమంత్రి గా కొనసాగుతున్న నేతగా రికార్డు నెలకొల్పారు. వ్యూహపూరితంగా వ్యవహరించే నేతగా, మోడీకి అత్యంత విశ్వసనీయుడిగా పేరు తెచ్చుకున్న షా.. ఉపరాష్ట్రపతి పదవికి బెస్ట్ ఎంపిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



గుజరాత్ హోంమంత్రి నుంచి దేశ హోంమంత్రిగా ఎదిగిన షా – ఇప్పుడు రాజ్యసభకు డైరెక్ట్ పట్టు సాధించగల శక్తివంతమైన రాజ్యాంగ పదవిలోకి అడుగుపెట్టబోతున్నారా ? అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ఇక షా ఉపరాష్ట్రపతిగా వెళ్ళినట్లయితే, హోం మంత్రిగా నడ్డాకు అవకాశం లభించవచ్చన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. గతంలో వెంకయ్య నాయుడిని కూడా మంత్రివర్గం నుంచి నేరుగా ఉపరాష్ట్రపతిగా చేసిన ఫార్ములా మళ్లీ అమలవుతుందా ? అని రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. ఫైనల్ గా చెప్పాలంటే – ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక .. ఉత్కంఠభరితంగా, భారీ మలుపులతో రాజకీయంగా రసవత్తరంగా మారనుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: