ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘జగన్ వర్సెస్ చంద్రబాబు’ అనే మాట తరచుగా వినిపిస్తున్నా, గడిచిన 15 మాసాల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు ప్రజల్లోకి చేరుతున్న తీరుపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో జగన్ కొన్ని హామీలు ఇవ్వడానికి సంశయించినా, అవే హామీలను చంద్రబాబు విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రధాన నాయకుల మధ్య తేడాను ప్రజలు, పరిశీలకులు గమనిస్తున్నారని తెలుస్తోంది.


ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం: జగన్ అంచనా తప్పిందా?:
గత ఎన్నికలకు ముందు జగన్ వెనకంజ వేసిన హామీలలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకం. ఈ పథకం వల్ల నెలకు రూ.250 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని, ఇది ఆర్టీసీని దివాలా తీయిస్తుందని జగన్ అప్పట్లో ప్రకటించారు. అయితే, గడిచిన ఆగస్టు 15వ తారీఖు నుంచి అమలవుతున్న ఈ పథకం ద్వారా ఆర్టీసీకి ఎక్కడా ఇబ్బందులు వచ్చిన దాఖలాలు లేవు. మహిళలు ఈ పథకాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విషయంలో జగన్ వెనకబడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.



డీఎస్సీ నియామకాలు: యువతకు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం :
ఉద్యోగ నియామకాల విషయంలో కూడా నాయకుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గత వైయస్సార్సీపీ పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోగా, ఉన్నవారిని కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేయమని ఒత్తిడి చేశారన్న వార్తలు వచ్చాయి. దీనికి భిన్నంగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 15 మాసాల్లోనే 16,347 డీఎస్సీ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయడం జరిగింది. తాజాగా సోమవారం 15,500 కొత్త టీచర్లు విధుల్లో చేరారు. ఈ విషయంలో వైయస్సార్సీపీ అధినేత జగన్ మైనస్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



అమ్మఒడి పథకం: చంద్రబాబు ‘బీట్’ చేసిన విధానం :
జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మఒడి పథకం విషయంలోనూ చంద్రబాబు కీలక మార్పులు తీసుకువచ్చి, జగన్‌ను అధిగమించారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గతంలో జగన్ కేవలం ఒక కుటుంబంలో ఒక పిల్లాడికి మాత్రమే అమ్మఒడి కింద రూ.13,000 ఇచ్చేవారు. అయితే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.13,000 చొప్పున అందిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అర్హులైన వారికి నిధులు జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.



ఈ మూడు కీలక అంశాల్లో (ఉచిత ఆర్టీసీ ప్రయాణం, డీఎస్సీ, అమ్మఒడి) చంద్రబాబు విజయవంతం కాగా, జగన్ వెనుకబడ్డారని విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ పరిణామాల క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత భిన్నంగా ఉండే అవకాశం ఉన్నందున, ఆ మేరకు పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పరిశీలకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: