వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సోషల్ మీడియా విభాగంలో జీతాల విషయంలో వివక్ష కారణంగా తీవ్రమైన అంతర్గత కలహాలు, అసంతృప్తి మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో, పార్టీ కోసం పోస్టులు పెట్టే ప్రతి కార్యకర్తకు డిజిటల్ కార్పొరేషన్ లేదా ఫైబర్ నెట్ ద్వారా జీతాలు ఇచ్చేవారు, లేదా కనీసం మద్యం దుకాణాల వద్ద వసూళ్లు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ సొంత నిధుల నుంచి జీతాలు చెల్లించాల్సి రావడంతో, సిబ్బంది సంఖ్యను తగ్గించారు. ఇప్పుడు మిగిలిన కొద్దిమందిలోనూ జీతాల పంపిణీలో అసమానతలు పెను సంక్షోభానికి దారి తీశాయి. ప్రస్తుతం సగం మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

లక్షల్లో జీతాలు: ఒక వర్గానికే పెద్ద పీట .. పార్టీలోని కొంతమంది ప్రముఖులకు మాత్రమే లక్షల్లో జీతాలు ఇస్తున్నారనే ఆరోపణలు మిగిలిన సిబ్బందిలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు, టీవీ యాంకర్ శ్యామలకు సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, అప్పుడప్పుడూ ప్రెస్ మీట్లు నిర్వహించినందుకు నెలకు రూ. 3 లక్షల జీతం ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. అదనంగా, పార్టీ కార్యక్రమాలకు తిరిగితే అదనపు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇటీవల కొన్ని కేసుల కారణంగా జైలుకు వెళ్లి వచ్చిన కొందరు ముఖ్యులను పర్మినెంట్‌గా పార్టీ కార్యాలయంలోనే ఉంచి, లక్షల్లో జీతాలిచ్చి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. అయితే, వీరంతా ఒకే వర్గానికి చెందినవారు కావడం, వారికి మాత్రం భారీ వేతనాలు ఇవ్వడం మిగతా సిబ్బందికి ఏ మాత్రం రుచించడం లేదు. ఇదే అసలు సమస్యకు మూలం.

తక్కువ జీతాలతో సతమతం: పేటీఎం ముద్ర-
మరోవైపు, సోషల్ మీడియాలో అత్యధికంగా పనిచేసే మిగిలిన సిబ్బందికి మాత్రం చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. గతంలో ఉన్న 'జగనన్న యాప్' ద్వారా పోస్టులకు లెక్క కట్టి చెల్లించే విధానం ఇప్పుడు లేదని తెలుస్తోంది. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అంటే ‘పేటీఎం’ ఆర్టిస్టుల ముద్ర మాత్రం చెరిగిపోలేదు. ఇప్పుడు నేరుగా జీతాలు ఇస్తున్నప్పటికీ, అవి సరిపోవడం లేదని కొందరి వాదన. స్వచ్ఛందంగా పనిచేసేవారు కొంతమంది ఉన్నప్పటికీ, ఈ వేతన వివక్ష గురించి తెలుసుకున్న తర్వాత వారంతా తమ గురించి పట్టించుకోవాలని ప్రస్తుత సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దొడ్డా అంజిరెడ్డి వెంట పడుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక, ఆయన చాలా మంది ఫోన్లు ఎత్తడం లేదని సమాచారం.

స్వచ్ఛంద కార్యకర్తల కరవు, పెయిడ్ ఆర్టిస్టులపై ఆధారపడటం :
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్‌ను ఘోరంగా వాడుకుని వదిలేయడం కారణంగా, జగన్ రెడ్డి కోసం స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తల సంఖ్య కరవైంది. అంతేకాక, వారు పంపే కంటెంట్ ఎక్కువగా అవాస్తవాలు, ఫేక్‌లు మరియు మార్ఫింగ్‌లు కావడంతో, సాధారణ ప్రజలు వాటిని పట్టించుకోవడం తగ్గించారు. అందుకే పార్టీ పూర్తిగా పెయిడ్ ఆర్టిస్టులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు ఆ పెయిడ్ ఆర్టిస్టులకు జీతాలు ఇవ్వడంలో వివక్ష చూపడం, కొందరికి లక్షల్లో, మరికొందరికి నామమాత్రంగా ఇవ్వడంతో సంక్షోభం ముదిరిపోతోంది. పార్టీ సోషల్ మీడియాలో ఏర్పడిన ఈ జీతాల చిచ్చు వైఎస్సార్సీపీకి కొత్త తలనొప్పిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: