ప్ర‌జాబ‌లం ఉన్న నేత‌ల‌కే టికెట్లు అంటూ చెప్పుకుంటూ వ‌స్తున్న చంద్ర‌బాబు చెప్పిన మాట ప్ర‌కార‌మే..చ‌ర్య‌ల‌ను ఆరంభించిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలో వ్య‌తిరేక‌త ఉన్న నేత‌ల‌ను ప‌క్క‌న బెడుతూ.. పార్టీ నేత‌లు సూచించిన పేరును..ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉన్న నేత‌ల‌కే టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ల విష‌యంలోనూ ఆయ‌న వైఖ‌రిలో అలాగే ఉండ‌టంతో కొంత‌మంది ఎమ్మెల్యేల్లో వ‌ణుకుపుడుతోంది. ఆ కోవ‌లోనే  అమ‌లాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు స్థానాలుండ‌గా ఇక్క‌డ రెండు నుంచి మూడు స్థానాల్లో మార్పులు ఉండ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఆరుగురు అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌గా..వైసీపీ అభ్య‌ర్థి కొత్త‌పేట నుంచి గెలిచారు. అయితే సిట్టింగ్ స్థానాల్లో మార్పులు ఖాయ‌మ‌న్న సంకేతాలు రావ‌డంతో స‌ద‌రు ఎమ్మెల్యేలు జాగ్ర‌త్త వ‌హించి కేడ‌ర్ ద్వారా త‌మ‌కు ఆ నేతే కావాల‌నే సంకేతాల‌ను..సిఫార్సుల‌ను పంపిస్తున్నారు.


అమలాపురం ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానంలో టీడీపీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అభ్యర్థిత్వం మార్పు అనివార్యమని తెలుస్తోంది. ఇక్కడి నుంచి దివంగత నేత, మాజీ లోక్‌స‌భ స్పీక‌ర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీ్‌షమాథూర్ రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న్ను  ఎంపీకి పోటీచేయించాల‌ని పార్టీ భావిస్తుండ‌గా..ఏమైనా మార్పులు చేయ‌ద‌ల్చుకుంటే మాత్రం  అసెంబ్లీ స్థానానికి బరిలో దింపే యోచనలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఆయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, పరమట శ్యామ్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు స‌మాచారం . సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆనందరావుపై ఓ వ్యక్తి ఆస్తులు కూడ‌బెట్టారంటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో పాటు ఓ వ్య‌క్తి హైకోర్టులో ఫిల్ కూడా దాఖ‌లు చేశాడు. దీంతో అధిష్ఠానం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందోన‌న్న టెన్ష‌న్ అయితే ఆయ‌న‌లో స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది.
 
గన్నవరంలో గరం గరం..
గన్నవరం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి పార్టీలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పాలనాపరంగా ఎమ్మెల్యే పనితీరుతోపాటు తనయుడు తీవ్రమైన జోక్యంతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అభ్యర్థిత్వం ఇచ్చే అంశంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆయ‌న్ను కాదంటే  ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆశావ‌హులు క్యూ క‌ట్టి ఉన్నారు. వారిలో ఎస్సీఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, ఎస్సీఎస్టీ మోనటరింగ్‌ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలిన్‌బాబుతోపాటు మరో ఇద్దరు నేత‌లున్న‌ట్లు స‌మాచారం. పార్టీ అధిష్ఠానం మాత్రం ఈసారి కొత్తవారికే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది
 
రాజోలులో రసవత్తరమే..
రాజోలు రిజర్వుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అభ్యర్థిత్వం ఎంపికపై పార్టీ అధిష్ఠానం స‌స్పెన్స్ కొన‌సాగిస్తోంది. నియోజకవర్గంలో గొల్లపల్లికి సానుకూల పరిస్థితులున్నప్పటికీ ఆయనను పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నిలపాలా లేక మళ్లీ రాజోలు నుంచే పోటీకి నిలపాలా అన్న అంశంపై అధిష్ఠానం దృష్టిసారించినట్టు సమాచారం.  ఇక్కడ గతంలో టిక్కెట్‌కోసం ప్రయత్నించిన భంగపడ్డ నాయకులే మళ్లీ ప్రయత్నాలకు తెరలేపారు.
 
మండపేటకు మళ్లీ జోగేశ్వరరావేనా..
మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేరునే దాదాపు ఖరారుచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మండపేటలో ఉన్న సెంటిమెంట్‌ల నేపథ్యంలో వేగుళ్ల అభ్యర్థిత్వంపైనా చర్చ నడుస్తోంది. వేగుళ్లతోపాటు మండపేట మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీహరిప్రకాష్‌ కూడా పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం.
 
ముమ్మిడివరం బుచ్చిబాబుకేనా..
ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేరు ఖరారు కావచ్చునని ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని మండలాలవారీగా పార్టీని విభజించి పాలించడం వల్ల కేడర్‌లో ఆయ‌న‌పై కొంత అసంతృప్తి ఉంది.  

తోట పార్టీ మారుతారా.?
రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యవహారశైలి టీడీపీతో సహా వివిధ పార్టీలకు అంతుపట్టని మిస్టరీగా మారింది. వీరు ముగ్గురు  పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన మాత్రం ఇప్పట్లో పార్టీని వీడే ప్రసక్తేలేదని ప్రకటించారు.  వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వపరంగా కీలక బాధ్యతలు అప్పగిస్తామనే హామీతో త్రిమూర్తులు పార్టీని మారతారా, లేక టీడీపీనుంచే రామచంద్రపురం నుంచి పోటీలో దిగుతారా అనేది రాజకీయవర్గాలను ఉత్కంఠతకు గురిచేసే పరిణామం.
 
బండారువైపే మొగ్గు..
కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన బండారు సత్యానందరావు అభ్యర్థిత్వానికే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి జగ్గిరెడ్డి పోటీ చేస్తే టీడీపీ నుంచి బండారు సత్యానందరావు పోటీ చేయ‌డంగా ఖాయ‌మ‌ని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: