టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. కేేశినేని నానికి తెలుగుదేశం పార్టీ లోక్ సభ లో పార్టీ విప్ పదవి ఇచ్చింది. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న నాని ఈ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. 


తనకు ఈ పదవి ఇచ్చినందుకు  చంద్రబాబు కు కృతజ్ఞతలు చెబుతూనే చురకలు వేశారు.  నా బదులు నాకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నానంటూ తన పోస్టులో తెలిపారు. 

విజయవాడ ప్రజలు నన్ను ఎంపీ గా ఎన్నుకున్నారు.. వారి ఆశీస్సులు నాకున్నాయి.. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుంది.. అంటూ కేశినేని నాని తన పోస్టులో రాసుకొచ్చారు. మరోసారి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలుపుతూ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెప్తున్నా అంటూ ముగించారు. 

తనతో పాటు ఎంపీలుగా గెలిచిన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులకు మంచి పదవులు ఇచ్చి తనకు విప్ తో సరిపుచ్చడంపై కేశినేని ఆగ్రహంగా ఉన్నారని.. అందుకే ఇలా స్పందించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ నిరసన ద్వారా ఉపయోగం ఏముంటుందన్న వాదన కూడా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: