న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టులో ఓ క్రీడాకారిణిని అక్కడి సిబ్బంది ఆపేశారు. ఆమెతో లగేజీలో ఓ రైఫిల్, దాని బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించి వాటిని బయటకు తీశారు. ఆమెను దానిపై ప్రశ్నించారు. తాను వాటిని ట్రైనింగ్ కోసం తీసుకెళుతున్నానని చెప్పడంతో దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని సిబ్బంది నిలువరించారు. దీంతో ఆమెకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. తాను ఓ కామన్వెల్త్ షూటర్‌నని, మధ్యప్రదేశ్‌లో షూటింగ్ ప్రాక్టీస్ కోసం వెళుతున్నానని, ఈ రైఫిల్‌కు తన వద్ద పర్మిషన్ ఉందని వారికి చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో కూడా వరుస ట్వీట్లు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి కిరెణ్ రిజిజు వంటి కేంద్ర మంత్రులను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేయడం ప్రారంభించింది.

విమానాశ్రయ అధికారులు తనను ఓ క్రిమినల్‌లా చూస్తున్నారని, తాను భోపాల్‌కు ట్రైనింగ్ కోసం వెళుతున్నానని, తనను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు అడ్డగించారని, తనను విమానం ఎక్కకుండా నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా ఆమె వెల్లడించారు. ‘నేను భోపాల్ వెళ్లాలి. నాతో పాటు షూటింగ్ కిట్ ఉంది. దానిని చూసిన ఎయిర్‌పోర్టు అధికారులు విమానం ఎక్కకుండా నన్ను ఆపేశారు. మారణాయుధాలు తీసుకెళుతున్నందుకు నన్ను నిలిపినట్లు చెప్పారు. నా దగ్గర పర్మిట్ ఉందని చెప్పినా వినిపించుకోలేదు.


పైగా రూ.10.200 లంచం కూడా డిమాండ్ చేశార’టూ ఆమె తన ట్వీట్‌లో వివరించారు. ఈ ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మినిస్టర్ అమిత్ షా, క్రీడా మంత్రి కిరెణ్ రిజిజు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజేలను ట్యాగ్ చేశారు. క్రీడాకారులను ఇలా కించపరచడం మంచి పని కాదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆమె చేసిన ట్వీట్లకు స్పందించిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యం అరగంట తరువాత ఆమెకు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఆమె క్రీడా మంత్రి కిరెణ్ రిజిజుకు కృతజ్ఞతలు చెబుతూ మరో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే తనను క్రిమినల్‌లా చూశారంటూ షూటర్ మనుభాకర్ చేసిన ఆరోపణలను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయ అధికారులు తోసిపుచ్చారు. ఆమె చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజాలు కావని అన్నారు. ఆమె వద్ద ఉన్న ఆయుధాలకు సంబంధించిన పర్మిషన్ పత్రాలను మాత్రమే చూపించాలని సిబ్బంది కోరారని ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తెలిపింది. ఒకవేళ పత్రాలు లేకుంటే దానికి తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని, అంతేకానీ ఎవరూ ఆమెను లంచం అడగలేదని తెలిపారు. ఆమెనే కాదని, ఆ స్థానంలో ఎవరు ఉన్నా వారు అలానే ప్రవర్తించేవారని, తమకు తమ ప్రయాణికుల యోగక్షేమాలు ఎంతో ముఖ్యమని, వారిని చిన్న ఇబ్బందికి గురి చేయడానికి కూడా తాము ఇష్టపడమని, కానీ అంతా నిబంధనల ప్రకారం జరిగితే అందరికీ మంచిదని చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: