
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగిపోయింది. ఓ ఎద్దు రెచ్చిపోతూ బైక్ పై వెళ్తున్న తల్లీ కొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, అది ఈస్ట్ ఢిల్లీలోని గీతా కాలనీ ఏరియా. ఆ రోడ్డు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. వాహనదారులు అటుఇటు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతలో ఓ బైక్ పై తల్లి, కొడుకు వచ్చారు. వారికి రోడ్డుపై సడెన్ గా ఓ ఎద్దు కనిపించింది. దీంతో ఆమె బైక్ ను స్లో చేసింది. ఎద్దు వెళ్లిపోయాక ముందుకెళ్లొచ్చని భావించింది. కానీ, అంతలోనే దారుణం జరిగింది. ఊహించని విధంగా సడెన్ గా ఎద్దు వారిపై దాడికి దిగింది. కొమ్ములతో పొడిచేసింది. ఈ దాడిలో బైక్ పై నుంచి తల్లీ కొడుకులు రోడ్డు మీదకు పడిపోయారు.
అయినా ఎద్దు వారిపై దాడిచేయడం ఆపలేదు. ఇది గమనించిన ఇతర వాహనదారులు, స్థానికులు వెంటనే అక్కడికి వచ్చారు. ఎద్దుని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. రాళ్లు, కర్రలతో దాన్ని తరమాలని చూశారు. కానీ, ఎద్దు దాడి ఆపలేదు. మహిళను ఆమె కొడుకుపై దాడిచేస్తూనే ఉంది. అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడి చేసింది. అలా కాసేపు ఎద్దు బీభత్సం కొనసాగించి, చివరికి అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎద్దు దాడిలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఎద్దు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నెటిజన్లు ఇలా పశువులు విచ్చలవిడిగా రోడ్డు మీద తిరక్కుండా, దాడులకు పాల్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.