ఏపీలో వైసీపీ దూకుడు మీద ఉంది. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఎన్నికల సమరశంఖం పూరించిన సీఎం జగన్ ఎన్నికల కార్యచరణను సైతం ప్రకటించారు. రాబోయే మూడు నెలలు జనంలో ఉండేలా ప్రణాళికలు రచించి వైసీపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో అభ్యర్థుల ఖరారు పై కసరత్తులు చేస్తున్నారు. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తానని తేల్చి చెబుతున్నారు.


అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీ గా గెలిచిన రఘురామ కృష్ణ రాజు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి రెబల్ గా మారారు. ఆయన్ను పార్టీ నుంచి మాత్రం వైసీపీ సస్పెండ్ చేయలేదు. కానీ చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి సొంత పార్టీపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అతనిపై ఎవరిని పోటీకి నిలబెట్టాలో వైసీపీ ఇంకా నిర్ణయించలేదు.


నర్సాపురంతో పాటు విజయవాడ, గుంటూరు లో వైసీపీ సరైన అభ్యర్థులు లేరు. గల్లా జయదేవ్, కేశినేని నాని లు 2018లో ఫ్యాన్ ప్రభంజనాన్ని ఎదుర్కొని గెలిచారు. ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వీరిద్దరూ మరోసారి టీడీపీ అభ్యర్థులగా బరిలో నిలవనున్నారు. వీరిపై పోటీకి జగన్ భారీగానే కసరత్తులు చేస్తున్నారు.


తాజాగా నర్సాపురంలో రఘురామపై పోటీకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తెరపైకి వచ్చింది. హుండీ నియోజకవర్గానికి చెందిన ఈయన వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.  శివరామరాజు పార్టీ మారుతారని టీడీపీ అనుకూల మీడియాలోనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వైసీపీ అధిష్ఠానంతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. స్పష్టమైన టికెట్ హామీ మేరకే పార్టీ మారుతున్నారని దసరా తర్వాత చేరిక జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇది నిజమో లేక ఆయన వ్యతిరేకులు టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో తెలుసుకోవాలంటే దసరా వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: