ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు ఉన్నారా అనే అనుమానం కూడా వస్తుంది. కొత్త వారి సంగతి దేవుడెరుగు.. ఉన్న వారికే ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్లేస్ లేక నానా పాట్లు పడుతున్నారు. చెప్పుకునేందుకు మాత్రం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణాలున్నాయి. అయితే... అవన్నీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో చూస్తే మాత్రం... పాపం అనిపిస్తుంది. కనీస వసతులు విషయం పక్కన పెడితే... అసలు ఆడుకునేందుకు గ్రౌండ్ లు కూడా లేక... ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో తెలియక... తమ దుస్థితికి బాధపడుతున్నారు. క్రీడాభివృద్ధికి సహకరిస్తామంటున్న ప్రభుత్వ పెద్దల మాట... నీటి మూటగానే మిగిలిపోయింది. కనీసం ఆచరణ పక్కన పెడితే... చివరికి పేపర్లలో కూడా వారి మాటలు కనిపించడం లేదు.

రాష్ట్రానికి రాజధాని ప్రాంతంగా ఉన్న విజయవాడ నగరంలోని ప్రముఖ క్రీడా ప్రాంగణం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం. ఇక్కడ ప్రతి రోజు ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తుంటారు. గతంలో ఇంటర్ నేషనల్ క్రికెట్ మ్యాచ్ కు కూడా ఇదే స్టేడియం వేదికగా నిలిచింది. అలాంటి ఈ స్టేడియం... ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా మారింది. విజయవాడ నగరంలో ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని భావిస్తే... ఠక్కున గుర్తుకు వచ్చేది మునిసిపల్ స్టేడియం మాత్రమే. వెంటనే అక్కడ ఏర్పాట్లు చేస్తారు. క్రీడాకారులు స్టేడియంలోకి రాకుండా ఆంక్షలు పెడతారు. ఇక చేసేది లేక... వాకర్స్ అంతా కూడా రోడ్లపైనే వ్యాయామం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి వేసిన బీఆర్టీఎస్ రోడ్డు వాకర్స్ కోసం ఉపయోగ పడుతుంది. ఇక భీముడిగా పేరున్న కోడి రామ్మూర్తి సొంత జిల్లా శ్రీకాకుళంలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒలింపిక్స్ లో భారత్ కు పతకం సాధించిన కరణం మల్లీశ్వరీ ప్రాక్టీస్ చేసిన శ్రీకాకుళం పట్టణంలోని కోడి రామ్మూర్తి స్టేడియం... ఇప్పుడు రూపురేఖలు లేకుండా పోయింది. గత ప్రభుత్వ హాయంలో స్టేడియం ఆధునీకీకరణ పేరుతో మొత్తం తవ్వేశారు. ఇక అంతే.. నాటి నుంచి నేటి వరకు అలాగే బోసిగా కనిపిస్తోంది. దీంతో చేసేది లేక... క్రీడాకారులు, వాకర్స్ కూడా పక్కనే ఉన్న ఆర్ట్స్ కాలేజీలో పని కానిస్తున్నారు. ఇక విజయనగరం పట్టణంలో పరిస్థితి మరీ దారుణం. కళ్లముందే స్థలం ఉన్నా కూడా... పెద్దల పెత్తనం కారణంగా దానికి తాళం వేశారు. మాన్సాస్ ట్రస్ట్ కు చెందిన కళాశాల ప్రాంగణం ఎన్నో ఏళ్లుగా క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు ఉపయోగ పడుతోంది. అయితే ట్రస్ట్ గత ఛైర్మన్ సంచయిత గజపతి రాజు కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు గేటుకు తాళం వేయించారు. ఇక అంతే... నాటి నుంచి కూడా గ్రౌండ్ తాళం అలానే ఉంది. ఎవరికీ అనుమతి లేదు.

పరిస్థితి ఇలా ఉంటే... భవిష్యత్తులో ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఎలా వస్తారనేది క్రీడా పండితుల సూటి ప్రశ్న. ఎవరికైనా స్పోర్ట్ మీద ఇంట్రస్ట్ ఉంటే... వాళ్లు వెంటనే ప్రైవేటు అకాడమీల వైపు పరుగులెత్తాలసిందే తప్ప... ప్రభుత్వం తరఫున ఎలాంటి సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. మెగా ఈవెంట్ లలో ఎవరైనా పతకాలు సాధిస్తే మాత్రం... కోట్లు కోట్లు ఇచ్చే ప్రభుత్వం... క్రీడాకారుల అభివృద్ది విషయంలో మాత్రం ఏ మాత్రం శ్రద్ధ చూపటం లేదు. నిధుల కేటాయింపు సంగతి పక్కన పెడితే... అసలు ఉన్న క్రీడా ప్రాంగణాలను పాడు చేయొద్దు మహాశయా అంటూ వేడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: