ఏపీలో జిల్లాల విభ‌జ‌న అంశం అధికార వైసీపీ వ‌ర్సెస్ విప‌క్ష టీడీపీతో పాటు పౌర సంఘాల మ‌ధ్య పెద్ద వార్‌కు కార‌ణ‌మైంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం జిల్లాల విభ‌జ‌న అసంబ‌ద్ధంగా చేసింద‌ని.. కొన్ని చోట్ల రెవెన్యూ డివిజ‌న్ల విష‌యంలో కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యం పెద్ద గంద‌ర‌గోళానికి కార‌ణ‌మైంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనూహ్యంగా జిల్లాల విభ‌జ‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం... దీనికి తోడు కొన్ని జిల్లాల కేంద్రాల‌ను మార్చి వేయ‌డంతో ప్ర‌జ‌ల నుంచి కూడా కొంత అస‌హ‌నం అయితే వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే హిందూపురం పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న రాఫ్తాడు నియోజ‌క‌వ‌ర్గాన్ని అనంత‌పురంలో క‌లిపిన ప్ర‌భుత్వం.. అస‌లు హిందూపురాన్ని జిల్లాయే చేయ‌లేదు. హిందూపురం కాకుండా పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా జిల్లా ఏర్ప‌డింది. దీంతో స‌హ‌జంగానే హిందూపురం ప్రాధాన్య‌త త‌గ్గింది. ఇదే బాల‌య్య‌కు రాజ‌కీయంగా త‌న వాయిస్ వినిపించేందుకు మంచి టైం అయ్యింది. హిందూపురాన్ని ప్ర‌త్యేక జిల్లా చేయాల‌న్న డిమాండ్ చేయ‌డంతో పాటు నిర‌స‌న దీక్ష‌కు దిగిన బాల‌య్య అవ‌స‌రం అయితే.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వం పుట్ట‌ప‌ర్తిని జిల్లా కేంద్రం చేయ‌డంతో హిందూపురం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలయ్య రాజీనామా డిమాండ్‌పై మంత్రి శంకర్ నారాయణ స్పందించ‌డంతో పాటు ఏడేళ్లుగా హిందూపురం అభివృద్ధిని పట్టించుకోని బాలయ్య రాజీనామా చేయాలని ప్రజలే కోరుతున్నార‌ని విమ‌ర్శించారు. బాల‌య్య షూటింగ్‌లు లేన‌ప్పుడే హిందూపురం ప్ర‌జ‌లు గుర్తుకు వ‌స్తార‌ని విమ‌ర్శించారు.

బాల‌య్య ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డే ఉంటాన‌ని అన్నార‌ని.. ఆ హామీ ఏమైంద‌ని  ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్ర‌శ్నించారు. మంత్రి శంక‌ర్ నారాయ‌ణ విమ‌ర్శ‌ల‌పై హిందూపురంలో పార్టీల‌కు అతీతంగా స్పందిస్తున్నారు. అస‌లు జిల్లాలోనే శంకర్ నారాయణ మంత్రి అనే సంగతే చాలామందికి తెలియదని.. ఆయ‌న బాల‌య్య‌పై కామెంట్లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని.. బాల‌య్య రాజీనామా చేస్తే శంక‌ర్ నారాయ‌ణ‌కు హిందూపురంలో పోటీ చేసి గెలిచే ద‌మ్ముందా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి బాల‌య్య నిజంగా రాజీనామా చేస్తే ఏపీ రాజ‌కీయాలు వేడెక్క‌డం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: