తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అయితే రోజురోజుకి కాంగ్రెస్ లో గెలుపు అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కడతారని హస్తం నేతలు భావిస్తున్నారు. ఆరు గ్యారంటీలతో తాము అధికారంలోకి రావడం గ్యారంటీ అని బలంగా నమ్ముతున్నారు.


ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు అనే దానిపై ప్రస్తుతం చర్చంతా నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు తమ మనసులో మాటను బయట పెడుతూనే ఉన్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తమకు అవకాశం రావచ్చొనే ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం పోటీలో ప్రధానంగా ఉన్న ఇద్దరు నేతలు. అయితే సీఎం రేసులో ఉన్న వారికి కొన్ని అనుకూలతు, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.


రేవంత్ రెడ్డి విషయానికొస్తే టీపీసీపీ అధ్యక్షుడు, సీఎం అంటే రేవంత్ వ్యతిరేకులు కర్ణాటక, రాజస్థాన్ లో జరిగిన ఘటనలు ఉదహరిస్తుంటారు. 2018 ఎన్నికల్లో సచిన్ ఫైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాజస్థాన్ లో అన్నీ తానై పార్టీని గెలిపిస్తే అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యారు. తాజాగా కర్ణాటకలో కూడా డీకే. శివకుమార్ కాంగ్రెస్ విజయంలో కీలక భూమిక పోషిస్తే సిద్ధరామయ్య సీఎం అయ్యారు అని చెబుతుంటారు. ఇది ప్రతికూలాంశం.  


అయితే రేవంత్ తన సానుకూల అంశాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. బయటి నుంచి వచ్చిన సిద్ధరామయ్య రెండు సార్లు సీఎం అయ్యారు అని చెబుతున్నారు. మరోవైపు భట్టి విక్రమార్క విషయానికొస్తే సీఎల్పీ నేతే సీఎం అవుతారు పీసీసీ అధ్యక్షుడు సీఎం కారు అనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు భట్టి పార్టీ పట్ల, సోనియాగాంధీ కుటుంబం పట్ల వీర విధేయుడు. అయితే కర్ణాటకలో డీకే. శివకుమార్ కు గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం అందిరికీ తెలిసిందే. ట్రబుల్ షూటర్ గా కూడా డీకేకు పేరుంది. అయినా సీఎం కాలేకపోయారు. చూద్దాం తెలంగాణలో ఏ సిద్దాంతం నిజం అవుతుందో.?

మరింత సమాచారం తెలుసుకోండి: