కేసీఆర్‌.. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసి చూపించిన నేత. దాదాపు దశాబ్దంన్నరగా తెలుగు రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ పదానికి పర్యాయపదంగా మారారు. తెలంగాణ సాధించడమే కాకుండా ఆ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించారు. అయితే ఇప్పుడు కాస్త కాలం కలసిరావట్లేదు. పదేళ్ల తర్వాత తొలిసారి కేసీఆర్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.


తెలంగాణ సాధనతో ఆగిపోకుండా దేశాన్ని కూడా ఏలేద్దామన్న ఆలోచనతో రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. అయితే.. అదే కేసీఆర్‌ కొంప ముంచిందన్న విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణాయే ఆత్మగా ఉన్న పార్టీ పేరులో ఆ పదం లేకపోవడం చాలా మైనస్‌ అయ్యిందన్న వాదన ఉంది. సొంత పార్టీ నేతలే చాలా మంది ఈ పేరు మార్పును వ్యతిరేకించినా కేసీఆర్‌ బలంగా నమ్మడంతో టీఆర్ఎస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌ అయ్యింది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పాగా వేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.


కానీ మొన్నటి ఎన్నికలతో అంతా తిరగబడింది. అనూహ్యంగా అధికారం చేజారింది. అయితే ఇందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చడమే కారణం అన్న వాదన కూడా మరోసారి బలంగా వినిపిస్తోంది. అంతే కాదు.. మళ్లీ పార్టీని పునరుజ్జీవం రావాలంటే.. మళ్లీ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాల్సిందే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ దిశగా పార్టీ నేతల నుంచి డిమాండ్లు బాగా వస్తున్నాయి. దేశం సంగతి దేవుడెరుగు ముందు రాష్ట్రంలో అయినా పార్టీ బతికి ఉండాలంటే.. పేరు మార్పు తప్పనిసరి అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.


ముందు రాష్ట్రంలో పార్టీ అంటూ బతికి ఉంటే కదా.. తర్వాత దేశం సంగతి ఆలోచించవచ్చని కొందరు పార్టీ నేతలు సూచిస్తున్నారు. తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే.. ఆ పార్టీకి తారక మంత్రంలాంటి తెలంగాణ వాదాన్ని మళ్లీ నమ్ముకోవాలని నాయకులు సూచిస్తున్నారు. ఈ వాదనలతో కేసీఆర్‌ కూడా కాస్త ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే మరి పార్టీ పేరు మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తారా.. లేదా.. ఒకసారి భారాసగా మార్చాక మళ్లీ వెనక్కి తగ్గడం ఏంటని మొండికేస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

brs