దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మార్చి 28వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీ కి కోర్టు అప్పగించింది. తనకు బెయిల్ ఇవ్వాలని దిల్లీ సీఎం వేసిన పిటిషన్ ను సైతం దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.


మద్యం కుంభకోణంతోనే సతమతం అవుతున్న కేజ్రీవాల్ కు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఖలీస్థానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి 2022 వరకు ఖలీస్థానీ గ్రూపులు ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారు రూ.133.54 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు బాంబు పేల్చారు. ఈ మేరకు గురుపత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.


ఆయన వీడియోలో మాట్లాడుతూ.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి తాము నిధులు అందించినందుకు బదులుగా జైలులో ఉన్న ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ ను విడుదల చేయడానికి హామీ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. కాగా భుల్లర్ 1993 దిల్లీ బాంబు కేసులో దోషిగా ఉన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ పై పన్నూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేవలం నిధుల విషయమై కాకుండా 2014లో అమెరికాలోని న్యూయార్క్ లో ఖలీస్థానీ అనుకూల సంస్థలతో కూడా కేజ్రీవాల్ సమావేశం అయ్యారని వీడియో ద్వారా వెల్లడించారు. గురుద్వారా రిచ్ మండ్ హిల్స్ లో ఈ భేటీ జరిగిందని ఆప్ పార్టీకి నిధులు ఇచ్చినట్లయితే భుల్లర్ ని విడుదల చేస్తామని ఈ సమావేశంలో హామీ ఇచ్చినట్లు పన్నూ ఆరోపించారు. ఇదిలా ఉండగా గతంలోను పన్నూ అరవింద్ కేజ్రీవాల్ పై ఇలా పలు విమర్శలు, ఆరోపణలు చేయడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: