కృష్ణా జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అవనిగడ్డ ఒకటి. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున సింహాద్రి రమేష్ పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో వరుసగా రెండుసార్లు రమేష్ ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో రమేష్ అద్భుతమైన మెజారిటీతో గెలిచారు.

ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటూ...వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అవనిగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కానీ నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ల పరిస్తితి ఇక్కడ దారుణంగా ఉంది. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు సాగునీరు, తాగునీరు సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

రాజకీయంగా వస్తే సింహాద్రి రమేష్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అటు టి‌డి‌పి తరుపున మండలి బుద్ధప్రసాద్ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. అయినా సరే ఇక్కడ టి‌డి‌పి క్యాడర్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. అలాగే తాజాగా వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కూడా టి‌డి‌పి సత్తా చాటింది. అసలు టి‌డి‌పి ఎన్నికలని బహిష్కరించింది. అయినా సరే అవనిగడ్డలో తెలుగు తమ్ముళ్ళు గట్టిగా పోరాడారు.


అసలు కృష్ణా జిల్లాలో టి‌డి‌పి... వైసీపీకి పోటీగా నిలబడింది...ఒక్క అవనిగడ్డలోనే. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలు వైసీపీనే దక్కించుకుంది. కానీ టి‌డి‌పి కూడా చాలా వరకు పోటీ ఇచ్చింది. 74 ఎం‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీ 51 గెలుచుకోగా, టి‌డి‌పి 19 చోట్ల గెలిచింది. జనసేన 4 చోట్ల విజయం సాధించింది. జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీదే పైచేయి...కానీ ఊహించని విధంగా మోపిదేవి జెడ్‌పి‌టి‌సి స్థానం టి‌డి‌పి గెలుచుకుంది...అటు చల్లపల్లి ఎం‌పి‌పిని కూడా కైవసం చేసుకోనుంది. అంటే ఈ ఎన్నికల ద్వారా తెలుగు తమ్ముళ్ళు వైసీపీ ఎమ్మెల్యేకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: