10నెలల క్రితం తిరుపతి ఎమ్మెల్యే పదవే ఎంతో గొప్పదని, ప్రజల రుణం తీర్చుకునేలా ఐదేళ్లు పనిచేస్తానని భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ ఆత్మీయ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. మళ్లీ వచ్చేటటువంటి ఎన్నికల్లో తను పోటీ చేసే ప్రసక్తి లేనే లేదని ప్రమాణం చేసి మరీ చెప్పారు. అయిదేళ్ళు ప్రతిక్షణం తిరుపతి బాగు కోసం పనిచేస్తానని, రాజకీయాలు, ఎన్నికలు ప్రధానం కాదని.. తిరుపతి ప్రజల యొక్క బాగోగులు తనకు ప్రధానమని చెప్పారు. తాను రాజశేఖర్ కుటుంబ ఆత్మీయుడిని అంతకంటే తనకు ఏ గౌరవం అవసరమే లేదని చెప్పుకొచ్చారు.


దాంతో రిటైర్ అవుతున్నానని ప్రకటించిన భూమన కరుణాకర్ రెడ్డి కి మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని అందరూ భావించారు. కానీ అందరి ఊహలను తుడిచి పడేస్తూ చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి, అస్సలు మంత్రి పదవి రేసులో ఉన్నట్లు ఎవరికీ తెలియనటువంటి నారాయణస్వామికి క్యాబినెట్ లో స్థానాలు దక్కాయి. నారాయణస్వామి డిప్యూటీ సీఎం పదవి దక్కగా... సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ప్రాధాన్యంతో కూడిన శాఖ పదవి దక్కింది.


మంత్రి పదవి దక్కకపోయినా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు దక్కుతాయని అనుకున్నప్పటికీ.. ఊహించని రీతిలో జగన్ బాబాయ్ వై వి సుబ్బా రెడ్డి టీటీడీ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. తనకి గురువుగా చెప్పుకునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి కూడా ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టిటిడి పాలక మండలిలో ఎక్స్‌ అఫీషియో సభ్యుడుగా.. ఇలా 3 పదవులను దక్కించుకోగా.. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఏ పదవి ఇప్పటివరకు దక్కలేదు. చివరికి తాను పార్టీలోకి తీసుకు వచ్చిన రోజాకు కూడా ఏపీఐఐసీ పదవి దక్కింది.

 

దీంతో భూమన కరుణాకర్ రెడ్డి అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వైయస్ కుటుంబానికి ఎంతో ప్రీతి పాత్రుడైన భూమన కరుణాకర్ రెడ్డికి చివరికి టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో లభించిన సభ్యత్వంతో తృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికీ పదవుల మీద పదవులు లభించి ఎంతో గౌరవం దక్కుతుండగా... భూమనకి మాత్రం ఏ పదవి దక్క కుండా వైయస్ కుటుంబానికి ఎందుకు దూరం అయ్యాడు అనే ప్రశ్న అందరి మెదడును తొలిచి వేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: