మనుషుల్లో ఒక్కొక్కరికి  ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. కానీ ఒక గిరిజన తెగకు చెందిన వారికి మాత్రం ఒకే రకమైన అభిరుచి . ఆ అభిరుచి ఏంటంటే వీళ్ళు తమ ఒళ్ళంతా రామనామం పచ్చ బొట్టుగా పొడిపించుకుంటారు. అసలు ఇంతకీ ఈ తెగ వారు ఎక్కడుంటారు ? ఎందుకలా ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకుంటారో తెలియాలంటే చదవండి .

భారత దేశంలోని 29 రాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఒకటి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉండే రాష్ట్రం కూడా. ఇక్కడ సంప్రదాయాలు , జీవన విధానం కాస్త వైవిధ్యం గా ఉంటుంది. మూఢ నమ్మకాల శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇక్కడ రామ్ నామీస్ అనే గిరిజన తెగ ఉత్తర, మధ్య ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా జంగాహాన్ ప్రాంతంలో అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.

కుల వ్యకువస్థ బలంగా ఉన్న మన భారత దేశంలో అగ్రవర్ణాల చేతిలో అత్యంత అణిచివేయబడ్డ వర్గాల్లో వీరోకరు.వీరిని హిందూ మతంలో అట్టడుగు స్థాయి వారిగా భావిస్తారు. దీంతో ఆది నుంచి వీరికి ఆలయాల్లో ప్రవేశం ఉండేది కాదు. వందల ఏండ్లుగా గుడికి , బడికి దూరంగా ఉంచబడ్డారు. గుడిలోకి ప్రవేశించి దేవుడిని చూసే అర్హత లేకపోవడంతో వీరు "రామ్ నామీ సమాజ్" అనే భక్తి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాముడినే తమ కుల దైవంగా భావించి ఆయన పేరును తమ ఒళ్ళంతా పచ్చబొట్టు రూపంలో ముద్రంచుకుంటారు. ఈ ఆచారాన్ని కొన్ని వందల ఏండ్లుగా పాటిస్తూ వస్తున్నారు .

" దేవుడు ఏ కులానికో , మతానికో చెందిన వాడు కాదు . దేవుడు మనలోనే ఉన్నాడు, మన శరీరంలోనే  కొలువై ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఈ సృష్టిలోని ప్రతి అణువులో దేవుడున్నాడు". అని ప్రగాఢంగా విశ్వసిస్తారు. వీరి శరీరంలో ఎక్కడ చూసినా రామనామమే కనిపిస్తుంది. 

 వీరు చిన్నతనంలోనే తమ పెద్దల సమక్షంలో పచ్చబొట్లు పొడిపించుకుంటారు.శరీరమంతా రామనామంతో పచ్చబొట్లు పొడిపించుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది, ఒక్కోసారి సంవత్సర కాలాన్ని సైతం పచ్చబొట్లు వేయించుకోవడానికి వెచ్చిస్తారు. గ్యాస్ నూనె దీపం నుంచి వచ్చే మసికి, నీళ్లు కలిపి సూదులతో పచ్చబొట్లు వేయించుకుంటారు. ఈ క్రమంలో అనేకసార్లు చాలామంది భరించలేని నొప్పి తో,అధిక రక్తస్రావమై చనిపోయారు కూడా. నొప్పి బాధిస్తున్నా , రక్తం కారుతున్న భరిస్తూ చనిపోయే ప్రమాదాన్ని జయించారంటే రామ్ నామీస్ అది పూనర్జన్మ గా భావిస్తారు. 

నాగరిక సమాజానికి దూరంగా బ్రతుకుతున్న వీరికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నిరంతరం రామ భక్తి లో మునిగే ఈ తెగ వారు మద్యం, మాంసం వంటి వాటికి ఆది నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా వీరి పేర్లలో సైతం రామ్ అని ఉంటుంది. కుల వివక్ష లేని సమాజం కోసం ఇప్పటికీ వీరు తమ వంతు కృషి చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: