తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ తొలి విడుత ఎన్నికలు సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి తొలి విడుత పోలింగ్ ప్రారంభం అయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మిగితా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడుతలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. 69 ఎంపీటీసీలు, రెండు జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 2,097 ఎంపీటీసీలు, 195 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఎంపీటీసీ స్థానాలకు 7072 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది పోటీపడుతున్నారు. 


జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరుగగా సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ఎన్నికయ్యారు. గ్రామాలస్థాయిలో జరిగే రెండో కీలకమైన ఎన్నికలు కావడంతో.. అభ్యర్థులు శనివారం సాయంత్రం వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జూలై మొదటివారంలో ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం ముగియనుంది. నిర్ణీత గడువులోగా పరిషత్ ఎన్నికలు జరిపి.. జూలైలో కొత్త పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. మొత్తం 32,042 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మూడు విడుతల ఎన్నికల్లో మొత్తం 1,56,55,897 మంది గ్రామీణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 1.47 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 54 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 


పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహిస్తుండటంతో మండల, జిల్లా పరిషత్‌లకు రెండు వేర్వేరు బ్యాలెట్లు అందుబాటులోకి తెచ్చారు. ఎంపీటీసీ సభ్యులకు గులాబీరంగు బ్యాలెట్, జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపురంగు బ్యాలెట్ ఖరారుచేశారు. పార్టీలకు కేటాయించే గుర్తులతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు 100 రకాల గుర్తులను కేటాయించారు. తొలి విడుత ఎన్నికలు జరిగే గ్రామాల్లోని ఓటర్లకు ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీచేశారు. ఓటరు ఎపిక్‌కార్డు లేనివారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపి ఓటువేయాలని ఎస్‌ఈసీ సూచించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎడమచేతి చూపుడు వేలికి ఇంక్‌తో గుర్తువేశారు. ఈ ఎన్నికల్లో ఎడమచేతి మధ్య వేలికి సిరాతో గుర్తు వేయనున్నారు. బ్యాలెట్‌లోని గుర్తులపై ముద్రవేస్తేనే ఓటు చెల్లుబాటు అవుతుంది. లేదంటే రద్దు అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: