ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో వేగంగా సాగుతోంది. వృద్దులు, దివ్యాంగులు, వితంతువులకు వాలంటీర్లు ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తున్నారు.  అయితే పలు ప్రాంతాల్లో గతంలో పించన్లు పంపిణీ చేసిన సెంటర్లవద్దకే లబ్ధిదారులను పిలిపించి పంపిణీ చేశారు.

 

పింఛన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న లబ్దిదారులకు డోర్‌ డెలివరీ విధానం ఊరటనిస్తోంది. ఏపీ వ్యాప్తంగా 54 లక్షల 65 వేల మందికి ఒకే రోజు పింఛన్లు అందజేసింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది 15వేల 675 కోట్లు కేటాయించగా,  ఇప్పటికే 1320 కోట్లు విడుదలయ్యాయి. అర్హత కలిగిన వారికి ఎవరికైనా పెన్షన్ రాకపోతే వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

 

మరోవైపు ఫించన్లు ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆశయానికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తూట్లు పొడిచారు. చాలా ప్రాంతాల్లో గతంలో పించన్లు పంపిణీ చేసిన సెంటర్లకు లబ్ధిదారులను పిలిపించి పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతాల వారికి ఎక్కడ పింఛన్లు ఇస్తున్నారో తెలియక తికమకపడ్డారు.  కర్నూలు నగరంలో 90శాతం పింఛన్లు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో పింఛన్లు పంపిణీ చేయలేదు.

 

ఒకే రోజు... లక్షలాది మందికి పెన్షన్లు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్‌  వెయ్యి కాకుండా ఇప్పుడు 2  వేల 250 చేశామని,  పెన్షన్‌ వయస్సు కూడా 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించామని చెప్పారు.  ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని  జగన్‌ ట్వీట్‌ చేశారు. మొత్తానికి సీఎం జగన్ తీసుకున్న ఇంటికే పింఛన్ల కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: