ఏపీలో అధికార వైసీపీలో మూడుముక్కలాట మొదలయింది. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వడం తో ఎన్నికల సందడి షురూ అయింది. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో ఘనవిజయం సాధించి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన‌ వైసిపి ఇప్పుడు సంచలన నిర్ణయాలతో ఏపీలో పాలన కొనసాగిస్తుంది. ఇక జ‌గ‌న్ మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానులు ఉంటాయ‌ని ప్ర‌క‌ట‌న చేశారు.


విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ జగన్ చేసిన ప్రకటన వైసీపీ నేతల మదిలో బలంగా నాటుకుంది. అయితే ఇప్పుడు రాజ్య‌స‌భ సీట్ల విష‌యంలో కూడా వైసీపీ నేత‌లు మూడు ప్రాంతాల‌కు మూడు సీట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కోస్తాకు ఒక‌టి, సీమ‌కు ఒక‌టి.. ఉత్త‌రాంధ్ర‌కు ఒక సీటు ఇవ్వాల‌న్న‌దే ఈ డిమాండ్‌. ఇక వైసీపీలో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల కంటే పార్టీ కోసం ముందు నుంచి ఉన్న వాళ్ల‌కే ప్ర‌యార్టీ ఇవ్వాల‌న్న డిమాండ్లు కూడా ఉన్నాయి.


జ‌గ‌న్ ఇప్ప‌టికే ఒక సీటును బీజేపీ కోటాలో ఇస్తున్న‌ట్టు జ‌రుగుతోన్న ప్ర‌చారం వైసీపీ నేత‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. బీజేపీ నుంచి వచ్చిన వారికి గానీ, ఆ పార్టీ సూచించిన వ్యక్తులకు గానీ, సినీ- వ్యాపారవర్గాలకు ఒక్క సీటు కూడా ఇవ్వవద్దని హైకమాండ్‌ని వైసీపీ ఆశావహులు కోరుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోసం చేసిన బీజేపీకి రాజ్య‌స‌భ సీటు ఇస్తే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని వాళ్లు చెపుతున్నారు.


ఇక సినిమా వాళ్లో లేదా పారిశ్రామిక వేత్త‌ల‌కు రాజ్య‌స‌భ సీట్లు ఇస్తే.. వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారే తప్ప.. పార్టీకి ఏమాత్రం ఉపయోగపడరని అభిప్రాయపడుతున్నారు. ఇప్ప‌టికే మండ‌లి ర‌ద్దు కావ‌డంతో జ‌గ‌న్‌పై రాజ్య‌స‌భ సీట్ల కోసం డిమాండ్ ఎక్కువుగా ఉంది. మ‌రి జ‌గ‌న్ ఈ సెగ‌ల నేప‌థ్యంలో ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో ?  చూడాలి.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: