ప్రస్తుత కాలంలో మనకు ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.... ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి చేకూరాలన్నా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యం. పెద్దలు, పిల్లలు అందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలి. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డ్ తీసుకునే అవకాశాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది. 
 
ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ కార్డ్ కావాలంటే తల్లి లేదా తండ్రి పిల్లలను తీసుకుని ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. తండ్రి లేదా తల్లి వారి ఆధార్ కార్డ్ సహాయంతో ఎన్ రోల్ మెంట్ ఫామ్ ను పూర్తి చేసి పిల్లల బర్త్ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డ్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ సెంటర్ నిర్వాహకులు పిల్లల ఫోటో మాత్రమే తీసుకుని కార్డు మంజూరు చేస్తారు. 
 
5 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలకు ఎన్ రోల్ మెంట్ ఫామ్ తో పాటు స్కూల్ ఐడీ కార్డ్, బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ కూడా కావాలి. పిల్లలకు స్కూల్ ఐడీ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. పిల్లల వయస్సు 15 సంవత్సరాలు దాటిన తరువాత కొత్త ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 
 
చిన్న పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డ్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఈ ఆధార్ కార్డును చైల్డ్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తరువాత ఒకసారి... 15 ఏళ్లు దాటిన తరువాత మరోసారి బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూ.ఐ.డీ.ఏ.ఐ. పిల్లల బయోమెట్రిక్ అప్ డేట్ చేయడానికి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: