సినిమా ప్రేమికులకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన’ భరత్ అనే నేను’ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో మార్పు తీసుకొచ్చే సీఎం పాత్రలో మహేష్ బాబు అదరగొడతాడు. అయితే సినిమాలో జరిగినట్లు నిజ జీవితంలో జరుగుతాయా అంటే, కొన్ని జరుగుతాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీలో అదే సీన్ నడుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘భరత్‌ అనే నేను’ సినిమాలో వాహనదారులకు సీఎం భరత్‌ విధించే జరిమానాలు గుర్తుకు తెచ్చే విధంగా జగన్ ప్రభుత్వం కూడా దిమ్మతిరిగే రీతిలో ఫైన్లు ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

అంటే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఫైన్లు పడనున్నాయి. బండి వేగంగా నడిపితే రూ.1,000.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు.. రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు.. పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు.. ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం.. రేసింగ్‌ మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు.

ఇంకా ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.1,000, అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ.1,000, రెండోసారి రూ.2 వేలు జరిమానా, అబ్బో ఇంకా చాలారకాలుగా భారీ ఫైన్లు వసూలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ ఫైన్లు పెంచడం జగన్ ప్రభుత్వానికి ఏమన్నా నెగిటివ్ అవుతుందా?అంటే ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏమి లేదనే చెప్పొచ్చు. కాకపోతే సినిమాలో మాదిరిగానే ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షాలు ఫైన్లపై రచ్చ చేస్తున్నారు. ప్రజలపై భారం పడుతుందని విమర్శిస్తున్నారు. అయితే సినిమాలో మహేష్ బాబు ఏం చెప్పారో, ఇప్పుడు అదే వైసీపీ నేతలు చెప్పాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించకపోతే ఫైన్లు కట్టాల్సిన అవసరంలేదు. కాకపోతే రోడ్లు మాత్రం బాగుచేయాల్సిన అవసరముంది. మరి చూడాలి భరత్ అనే నేను సినిమా జగన్‌కు వర్కౌట్ అవుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: