ఇప్పటి వరకూ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ రాజధానిగా పేరు తెచ్చుకుంది. ఇక సినీరంగం, పారిశ్రామిక రంగాలూ బాగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా స్పేస్ రంగంలోనూ దూసుకెళ్తోంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనల సంస్థ స్కైరూట్ ఏరో స్పేస్, భారత అంతరిక్ష పరిశోధనల సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని.. సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తోంది. ఇస్రోతో ఒప్పందంతో సాంకేతిక నైపుణ్యం, అనుభవం, సదుపాయాలను వినియోగించుకునే అవకాశం స్కైరూట్‌కు లభిస్తుంది.
ఇంతకీ ఈ స్కై రూట్ సంస్థ ఏంటో చెప్పలేదు కదా.. ఈ సంస్థ ప్రధానంగా ‘లాంచ్ వెహికల్ టెక్నాలజీ’ మీద పనిచేస్తోంది. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టటానికి వీలైన మూడు రకాల లాంచ్ వెహికల్స్‌ను ఇప్పటికే ఈ సంస్థ ఆవిష్కరించింది. గతంలో ఇస్రోలో పనిచేసిన నాగ భరత్, పవన్ కుమార్ చందన కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ సరికొత్త ఆవిష్కరణల సంస్థకు ఇప్పటికే 4.3 మిలియన్ డాలర్ల వెంచర్ కేపిటల్ నిధులు కూడా లభించాయి.
అంతే కాదు.. మరో 15 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించే యత్నాల్లో ఈ సంస్థ ఉందట. ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తాము తయారు చేసిన ఉపకరణాలను త్వరలో ఇస్రో కేంద్రాల్లో పరీక్షిస్తామని స్కైరూట్ సంస్థ చెబుతోంది. ఇప్పటికే హైదరాబాద్ ఇటీవల కాలంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం గా కూడా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పుడీ స్క్రై రూట్ సంస్థ హైదరాబాద్ ప్రతిష్టను పెంచేలా పని చేయాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి