ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ మట్టి కరిచిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పత్రిక ఓ విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. అందులో తెలుగు దేశం తప్పులు బాగానే ఎత్తి చూపింది. ఆ పత్రిక ఏం రాసిందంటే..
“ పంచాయతీ ఎన్నికల్లో ఇంతటి ఘోర పరాజయానికి స్వయంకృతాపరాధమే కారణమని టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు వాపోతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎదిగిన నాయకులెవరూ పంచాయతీ ఎన్నికల బరిలో నిలవలేదు. ‘కొత్త వారికి అవకాశం’ అనే సాకు చూపుతూ దూరంగానే ఉండిపోయారు. పోనీ.. ఎన్నికల్లో నిలిచిన వారికి అండగా ఉన్నారా అంటే అదీ లేదు. ఖర్చు సంగతి పక్కనపెడితే... కనీసం అభ్యర్థి వెన్నంటి ఉండి ధైర్యమూ చెప్పలేదు. సీనియర్ నాయకులందరూ ఏవేవో కారణాలు చూపించి పక్కకు తప్పుకోవడంతో చాలాచోట్ల ఆర్థికంగా బలహీనులు, గ్రామాల్లో పెద్దగా బలంలేని వారినే పోటీకి నిలపాల్సి వచ్చింది. ఇక... పోలింగ్ రోజున బూత్‌ల వద్ద అభ్యర్థులు తప్ప, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ సీనియర్ నాయకులు కానీ, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినవారుకానీ కనిపించలేదు. అక్కడక్కడా ఒకరిద్దరు మెరుపులా మెరిసి మాయమయ్యారు. ‘అధికార పార్టీ డబ్బులు పంచుతోంది’ అని శోకాలు తీసేవారు తప్ప... తమ అభ్యర్థులకు ఆర్థికంగా-నైతికంగా అండగా నిలిచేవారు కనిపించలేదు. దీంతో టీడీపీ అభ్యర్థులు పోలింగ్ బూత్‌లవద్ద నిస్సహాయంగా మిగిలిపోయారు.
ఏదిఏమైనా కుప్పం పంచాయతీల్లో గెలుపు జెండా ఎగరేసి.. చంద్రబాబు లక్ష్యంగా విరుచుకుపడాలనేది వైసీపీ వ్యూహం! దీనిపై అప్రమత్తమై దీటైన వ్యూహాలు రచించే వారే కరువయ్యారు. చంద్రబాబు అమరావతి కేంద్రంగా రాష్ట్రవ్యాప్త ఎన్నికలను పర్యవేక్షిస్తుండగా... ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నేతల్లో గెలిచి తీరాలన్న పోరాట పటిమ ఏమాత్రం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ... ‘పార్టీ బలంగా ఉంది. మన వాళ్లే గెలుస్తారు’ అంటూ చంద్రబాబును మభ్యపెట్టినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధినేత క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని... బలమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అంటూ ఆంధ్రజ్యోతి రాసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి